
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన తెలివితేటల్ని భువనేశ్వరి ఎదుట ప్రదర్శించారు. అఖిలప్రియ రాజకీయ పరిజ్ఞాన ప్రదర్శనకు రాజమండ్రిలోని సత్యమేవ జయతే దీక్షా ప్రాంగణం వేదికైంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ గాంధీ జయంతిని పురస్కరించుకుని టీడీపీ సత్యమేవ జయతే అంటూ దీక్షకు పిలుపునిచ్చింది. భువనేశ్వరితో పాటు టీడీపీ నాయకులు దీక్ష చేశారు.
భువనేశ్వరి చేపట్టిన దీక్షకు పలువురు మహిళా నాయకురాళ్లు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
"ఢిల్లీ నుంచి లోకేశ్ అన్న చలో రాజమండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన పిలుపు అందుకుని రాజమండ్రి సెంట్రల్ జైలును బద్దలు కొట్టైనా మన నాయకుడిని బయటికి తీసుకురావాలని మనసులో చాలా కోరిక వుంది" అని వివాదాస్పద కామెంట్స్ చేశారామె.
రానున్న ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే భయం అఖిలప్రియను వెంటాడుతోంది. టీడీపీ సర్వేలన్నీ ఆమెకు వ్యతిరేకంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో భూమా కుటుంబంలోనే ప్రత్యామ్నాయ నాయకుడిపై టీడీపీ దృష్టి సారించింది. చంద్రబాబు అరెస్ట్ కాకపోయి వుంటే, ఈ పాటికి ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆళ్లగడ్డ టికెట్‌ను దక్కించుకునే క్రమంలో భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్ దృష్టిలో పడేందుకు అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌ను రాజకీయంగా తనకు సానుకూలంగా మలుచుకునేందుకే అఖిలప్రియ భారీ డైలాగ్‌లు కొట్టారని టీడీపీ నేతల అభిప్రాయం. అయితే అఖిలప్రియ మాటల వెనుక మర్మం తెలియని భువనేశ్వరి అవాక్కైనట్టు తెలిసింది. దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పెద్దల మాటల్ని అఖిలప్రియ చక్కగా అమలు చేస్తున్నారు. బాబు జైల్లో ఉండగానే ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆళ్లగడ్డ టికెట్‌పై హామీ పొందాలనే ఆమె ప్రయత్నాల్ని ఎలా కాదనగలం? రాజకీయ నాయకులు కోటలు దాటేలా మాట్లాడుతున్నారంటే... అంతా టికెట్ కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా