చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ దిక్కుతోచని స్థితిలో వుంది. ఎన్నికల ముంగిట ఈ పరిణామాలను చంద్రబాబు సహా టీడీపీ నేతలెవరూ ఊహించలేదు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్, మూడు వారాలకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన వుండడం టీడీపీ పాలిట ఓ పీడకల.
ఈ నేపథ్యంలో బాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 3న బాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు చూసుకుని బస్సు యాత్రకు సిద్ధం కావాలనే అభిప్రాయానికి వచ్చారు. క్వాష్ పిటిషన్‌పై బాబుకు సానుకూల తీర్పు రాకపోతే, ఇక భువనేశ్వరి జనంలోకి వెళ్లడమే మిగిలి వుంది.
భువనేశ్వరి బస్సు యాత్ర ప్రధానంగా ఎలాంటి సంకేతాలు ఇస్తుందనే చర్చకు తెరలేచింది. యువగళం పేరుతో నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి ఆఖరులో పాదయాత్ర మొదలు పెట్టారు. బాబు అరెస్ట్‌తో లోకేశ్ పాదయాత్ర అర్ధంతరంగా ఆగిపోయింది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటే, లోకేశ్ ఢిల్లీకి వెళ్లిపోయారు. సీఐడీ అరెస్ట్ చేస్తుందనే భయంతో లోకేశ్ ఢిల్లీ విడిచి రాలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీన్ని టీడీపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోంది.
ఈ నేపథ్యంలో భువనేశ్వరి బస్సు యాత్ర టీడీపీకి రాజకీయంగా మేలు చేయడం కంటే, కీడే ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ కావడం వల్లే భువనేశ్వరి రాజకీయంగా యాక్టీవ్ కావాల్సి వచ్చిందనే నెగెటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రమాదం లేకపోలేదు. దీన్ని టీడీపీ గుర్తించినట్టు లేదు. ఇప్పటికే లోకేశ్ పాదయాత్ర ఉండగా, మళ్లీ బస్సుయాత్ర దేనికంటే సమాధానం ఏం చెబుతారు?
లోకేశ్ భయపడి ఢిల్లీకే పరిమితం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భువనేశ్వరి బస్సుయాత్ర పేరుతో జనంలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారా? అని టీడీపీ సమాధానం చెబుతుందా? తల్లి బస్సుయాత్రతో తనయుడి రాజకీయ అసమర్థతను లోకానికి చాటి చెప్పడం తప్ప, మరో ప్రయోజనం వుండదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ కష్టకాలంలో వుంటే, దీటుగా ఎదుర్కొని శ్రేణులకు భరోసా ఇచ్చేంత సీన్ లోకేశ్‌కు లేదని బాబు అరెస్ట్ ఎపిసోడ్ తేల్చి చెప్పింది. దాన్ని భువనేశ్వరి బస్సుయాత్ర మరింత బలంగా జనానికి రానున్న రోజుల్లో చెప్పడానికి రెడీ సిద్ధమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై సానుకూల తీర్పు రాదని అభిప్రాయానికి టీడీపీ వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకే భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధమైనట్టు టీడీపీ నడవడికే చెబుతోంది. బాబు అరెస్ట్ అనంతరం టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలేవీ తెలివిగా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు.