మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాలం చెల్లిన నాయకుడి జాబితాలో చేరిపోయారు. అయితే రాజకీయాలపై మమకారం ఆయన్ను నిశ్చిలంగా ఒక పార్టీలో కొనసాగనివ్వడం లేదు. రోజుకో పార్టీ మారుతూ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రజల్లో అభాసుపాలయ్యారు. ఇంత కంటే పతనం కావడానికి కూడా ఆయన మిగుల్చుకున్న పరపతి ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి కుటుంబం ఒకప్పుడు హవా చెలాయించింది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి తండ్రి శేషశయనారెడ్డి 1978లో కాంగ్రెస్ (ఐ) తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో కూడా 1983లో శేషశయనారెడ్డి గెలుపొందడం ద్వారా తన పట్టు నిరూపించుకున్నారు. శేషశయనారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు.
కాంగ్రెస్ కుటుంబానికి చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి 1994లో టీడీపీ తరపున నందికొట్కూరు నుంచి గెలుపొందారు. 99లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. 2004లో గౌరు చరిత చేతిలో బైరెడ్డి ఓడిపోయారు. 2009లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో బైరెడ్డికి ఒక నియోజక వర్గం అంటూ లేకుండా పోయింది. అనంతరం ఏపీ విభజన బైరెడ్డి రాజకీయ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.
బైరెడ్డి రాయలసీమ కోసమంటూ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. సీమకు టీడీపీ ద్రోహం చేసిందని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడిగా ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదించి బీజేపీలో చేరారు. అక్కడా ఆయన స్థిరంగా ఉండలేదు.
ఆ మధ్య కడపలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో కనీసం ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన అలకబూనారు. మరోవైపు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తనయ శబరి మాత్రం బీజేపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఇటీవల ఆమె నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. నంద్యాలలో ఈ నెల 16న బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి, శబరి బాధ్యతలు కూడా తీసుకున్నారు. మరోవైపు బీజేపీ పెద్దల్ని బైరెడ్డి రాజశేఖరరెడ్డి తిడుతున్నారు.
తాజాగా ఆయన రాజమండ్రికి వెళ్లి నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని కోరారు. త్వరలో టీడీపీ కండువా కప్పుకోడానికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి సిద్ధమయ్యారని చెప్పొచ్చు. గత ఎన్నికల సందర్భంలో కూడా టీడీపీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి మద్దతు తెలిపారు. బైరెడ్డి వారసత్వాన్ని ఆయన తమ్ముడి కుమారుడు సిద్ధార్థ్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జనం సిద్ధార్థ్ వైపు ఉన్నారు. సిద్ధార్థ్ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే శాప్ చైర్మన్ కూడా.
నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి అంత సీన్ లేదని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తెలియచెప్పాయి. కనీసం సొంత గ్రామంలో కూడా సర్పంచ్‌ను గెలిపించుకోలేని దయనీయ స్థితిలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా పిల్లి మొగ్గలు వేయాల్సిన అవసరం ఏంటో బైరెడ్డి చెప్పాలి. తాను టీడీపీలో, కూతురు బీజేపీలో ఉంటే, జనం విశ్వసించరనే కనీస స్పృహ కూడా లేకుండా రాజశేఖరరెడ్డి తప్పలడుగులు వేస్తున్నారు. ఇది తన కూతురికి రాజకీయంగా నష్టం తెస్తుందని గ్రహిస్తే మంచిది.