తిరుమ‌ల‌లో టీడీపీ జెండా ఎగురేస్తే బీజేపీ మాట్లాడ‌దేం?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌లలో రాజ‌కీయాలు నిషిద్ధం. ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ జెండా లేదా ఫొటోల‌ను పెట్ట‌కూడ‌దు. తిరుమ‌ల‌లో రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాల‌ను కూడా మాట్లాడ‌కూదు. కానీ కొంద‌రు నాయ‌కులు నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న…

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌లలో రాజ‌కీయాలు నిషిద్ధం. ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ జెండా లేదా ఫొటోల‌ను పెట్ట‌కూడ‌దు. తిరుమ‌ల‌లో రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశాల‌ను కూడా మాట్లాడ‌కూదు. కానీ కొంద‌రు నాయ‌కులు నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టి రాజ‌కీయాల గురించి మాట్లాడుతుంటారు. ఇది కాస్త శ్రుతిమించింది.

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యం ఎదుట టీడీపీ జెండాను ఆ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త ఎగుర‌వేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి దీస్తోంది. ఆల‌యం ఎదుట భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌ను కూడా ఇది స్ప‌ష్టంగా ప్ర‌తిబింబిస్తోంది. ఇదిలా వుండ‌గా హిందూమ‌తానికి, తిరుమ‌ల‌కు తామే ప్ర‌తినిధుల‌మంటూ విర‌వీగే బీజేపీ నాయ‌కులు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట టీడీపీ జెండా ఎగుర‌వేయ‌డంపై ఎందుకు మాట్లాడ్డం లేద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

తిరుమ‌ల‌లో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా… రాజ‌కీయంగా సొమ్ము చేసుకోడానికి స్థానిక బీజేపీ నాయ‌కుడు, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి భానుప్ర‌కాశ్‌రెడ్డి మీడియా ముందుకొస్తుంటారు. మ‌రి ఇప్పుడు తిరుమ‌ల‌లో ఏకంగా టీడీపీ ఎగరేస్తే భానుప్ర‌కాశ్‌రెడ్డి ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. త‌మ పార్టీ అధ్య‌క్షురాలు టీడీపీ అనుకూల వైఖ‌రితో న‌డుచుకుంటుండంతో ఆ పార్టీ తీరుకు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పితే త‌న‌కు బీజేపీలో స్థానం వుండ‌ద‌నే భ‌య‌మా? అని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో త‌న గురువు వెంక‌య్య‌నాయుడి ఆశీస్సుల‌తో టీడీపీ ప్ర‌భుత్వంలో భాను టీడీపీ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకున్నారు.

అందుకే టీడీపీ విష‌యంలో ఇంకా విశ్వాసాన్ని చూపుతున్నారా? అని నిల‌దీస్తున్నారు. తిరుమ‌ల‌లో నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు న‌డుచుకున్నా ప్ర‌శ్నించాల్సిన బీజేపీ నేత‌లు… రాజ‌కీయ కోణంలో చూస్తూ లాభ‌న‌ష్టాల‌ను బేరీజు వేసుకుంటూ భానులాంటి నేత‌లు లౌక్యంగా న‌డుచుకుంటున్నార‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. దేవుడి కంటే ఎవ‌రూ, ఏదీ గొప్ప‌ది కాద‌ని అర్థం చేసుకోవాల‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు.