Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీ మీద డేగ కన్ను?

వైసీపీ మీద డేగ కన్ను?

వైసీపీ ముక్కుతూ మూలుగుతూ ఉత్తరాంధ్రలో గెలిచినవే రెండు ఎమ్మెల్యే సీట్లు. ఒక ఎంపీ సీటు. విశాఖ ఏజెన్సీలో అరకు పార్లమెంట్, అరకు పాడేరు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. గిరిజనం ఫ్యానాభిమానం ముందు ఏ సునామీ అసలు పని చేయలేదు సరికదా తుస్సుమనిపోయింది. అయితే ఈ గెలిచిన ప్రజా ప్రతినిధుల మీద డేగ కన్ను పడుతోంది అని ప్రచారం సాగుతోంది. ఒక బడా పార్టీ వీరిని తమ వైపునకు తిప్పుకోవడానికి పధక రచన చేస్తోందని అంటున్నారు.

జనంలో అభ్యర్ధిని పెట్టి గెలవడం అన్నది ధర్మం, ఓడితే గెలిచిన వారిని తమ వైపు తిప్పుకోవడం వ్యూహం. ఇపుడు వ్యూహాలనే అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఏపీలో ఘోరంగా ఓడి భవిష్యత్తుని అయోమయం చేసుకున్న వైసీపీ మీద జాతీయ పార్టీ కన్ను పడిందని అంటున్నారు.

పైగా ఎంపీల కోసం నకనకలాడుతున్న పరిస్థితి ఢిల్లీలో ఉంది. ఒక్క ఎంపీ ఉన్నా మంత్రి పదవులు ఇచ్చి దగ్గర పెట్టుకుంటున్న నేపధ్యం ఉంది. దాంతో అరకు ఎంపీని టార్గెట్ చేశారు అని అంటున్నారు. అరకు ఎంపీ కుటుంబీకులు వైసీపీకి అత్యంత విశ్వాసపాత్రులు.

అయితే విశ్వాసం అన్న శకం రాజకీయాల్లో ముగిసి చాలా దశాబ్దాలు అవుతోంది. పైగా అరకు వైసీపీకి యాంటీ సెంటిమెంట్ గానూ ఉంది. 2014లో కొత్తపల్లి గీతను గెలిపిస్తే ఆమె తరువాత జెండా మార్చేశారు. అందువల్ల అదే యాంటీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని వైసీపీలో కలవరం అయితే ఉంది.

వైసీపీ విషయానికి వస్తే జిల్లా స్థాయిలో పట్టించుకునే పెద్ద దిక్కు కూడా ఎవరూ లేరు. షటిల్ సర్వీస్ చేస్తూ హైదరాబాద్ టూ విశాఖ వచ్చి వెళ్ళే నేతల చేతిలో రెండేళ్ళుగా పార్టీ పడి ఎంత ఘోరంగా నష్టపోవాలో అంతగానూ నష్టపోయింది. దాంతో వైసీపీలో ఒక రకమైన అంతర్మధనం కూడా సాగుతోంది అంటున్నారు. ఓడిన వారు ఎటూ పక్క చూపులు చూస్తున్నారు. గెలిచిన వారి మీద డేగ కన్ను పడుతోంది. దాంతో అతి తొందరలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?