నాగబాబు మీద పోటీకి ఓటమెరుగని వీరుడు రెడీ!

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేసే టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారు అయిపోయినట్లే. ఆయనే జనసేన అధినేత పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు. తనకు అన్ని…

ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేసే టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారు అయిపోయినట్లే. ఆయనే జనసేన అధినేత పవన్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు. తనకు అన్ని విధాలుగా కలసి వచ్చే సీటు ఇదే అని ఫిక్స్ అయి నాగబాబు అనకాపల్లికి షిఫ్ట్ అయ్యారు అంటున్నారు.

సామాజిక రాజకీయ సమీకరణలు అనుకూలిస్తాయని జనసేన ఆలోచించిన మీదటనే నాగబాబుని పోటీకి దించుతున్నారు అని తెలుస్తోంది. నాగబాబు అటు వైపు ఉంటే వైసీపీ నుంచి ఎవరు పోటీ అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ అంత సులువుగా ఈ సీటుని పోనీయదు అని అంటున్నారు.

నాగబాబుకు రాజకీయంగా సామాజికంగా ధీటైన జవాబు ఇచ్చే బలమైన అభ్యర్ధిని సెలెక్ట్ చేసి పెట్టిందని అంటున్నారు. ఆయన ఓటమి ఎరుగని వీరుడు, వైసీపీకి జగన్ కి వీర విధేయుడు అయిన మాడుగుల ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అని అంటున్నారు. ఆయన మాడుగుల నుంచి రెండు సార్లు గెలిచారు. టీడీపీకి కంచుకోట లాంటి మాడుగులను వైసీపీ సీటుగా మార్చిన సమర్ధుడైన నేతగా బూడికి పేరుంది.

ఆయన అక్కడ ఎమ్మెల్యేగా మరోసారి విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. ఆయనను ఇపుడు వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తోంది అని అంటున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు అయితే బీసీగా రాజకీయ సీనియర్ గా నాగబాబుని ఢీ కొట్టి ఘన విజయం సాధించగలరని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రధాన సామాజిక వర్గాలుగా కాపులు, వెలమలు, గవరలు ఉన్నారు. ఈ మూడు సామాజిక వర్గాల చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. గత మూడు దశాబ్దాలుగా తొమ్మిది సార్లు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్నికలు జరిగితే గవర సామాజిక వర్గం నుంచి మూడు సార్లు, కాపుల నుంచి నాలుగు సార్లు, వెలమల నుంచి రెండు సార్లు ఎంపీలు గెలిచారు.

ఈ ఎంపీ సీటు పరిధిలో నర్శీపట్నం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తిలలో వెలమల ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, గవరల ప్రాబల్యం అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తిలలో ఉంటుంది. కాపుల ప్రాబల్యం ఎక్కువగా పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి,చోడవరం పాయకరావుపేటలలో ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా పోటా పోటీగానే అంతా ఉంటుంది.

నాగబాబు మీద బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తే కాపు వర్సెస్ బీసీ అన్న కార్డుతో ముందుకు వెళ్లాలని వైసీపీ చూస్తోంది. బీసీలు అంతా పోలరైజ్ అయితే వైసీపీ విజయం తధ్యం అన్న ఆలోచనలు ఉన్నాయి. జెడ్పీటీసీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చిన బూడి ముత్యాలనాయుడుకు ఎక్కడా ఓటమి లేదు. అందువల్ల ఆయన గెలుపు సెంటిమెంట్ సైతం వైసీపీకి కలసి వస్తుందని అంటున్నారు.