Advertisement

Advertisement


Home > Politics - Andhra

బ‌హిష్క‌ర‌ణ కోస‌మే... అసెంబ్లీలో గొడ‌వా?

బ‌హిష్క‌ర‌ణ కోస‌మే... అసెంబ్లీలో గొడ‌వా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స్పీడ్ పెంచారు. ప్ర‌తి విష‌యంలోనూ అధికార పార్టీని టార్గెట్ చేసే క్ర‌మంలో చంద్ర‌బాబు ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అసెంబ్లీలో ఇవాళ్టి అవాంఛ‌నీయ ప‌రిణామాల వెనుక చంద్ర‌బాబు ఉద్దేశం గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల‌కు ఇక ఏడాది గ‌డువు మాత్ర‌మే వుంది. బ‌డ్జెట్ స‌మావేశాలు ఇక రెండు రోజులు జ‌ర‌గ‌నున్నాయి.

రానున్న రోజుల్లో అసెంబ్లీ స‌మావేశాలు ఎక్కువ రోజులు జ‌రిగే అవ‌కాశం లేదు. దీంతో వైసీపీ రౌడీయిజం కార‌ణంగానే అసెంబ్లీని బ‌హిష్క‌రించాల్సి వ‌చ్చింద‌నే నింద‌ను వేయ‌డానికే చంద్ర‌బాబు గొడ‌వ‌కు ప్లాన్ చేశార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అసెంబ్లీ స‌మావేశాల్ని బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌న భార్య భువ‌నేశ్వ‌రిపై అధికార పార్టీ స‌భ్యులు అస‌భ్య దూష‌ణ‌కు దిగార‌ని చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తిరిగి ముఖ్య‌మంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి వెళ్లారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యేల‌పై వైసీపీ స‌భ్యులు దాడుల‌కు దిగార‌ని, ప్ర‌జాస్వామ్యంలో ఇది దుర్దినం అని ఇప్ప‌టికే చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌కు దిగారు. చివ‌రికి ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి త‌మ స‌భ్యులు నిల‌దీస్తే, స‌మాధానం చెప్ప‌డానికి బ‌దులు, దాడుల‌కు తెగ‌బ‌డే దుస్థితికి వైసీపీ నేత‌లు దిగ‌జారార‌నే ప్ర‌చారం చేయ‌డానికే చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల ముంగిట ఈ ప్ర‌చారం బాగా ప‌ని చేస్తుంద‌ని టీడీపీ న‌మ్ముతోంది. అసెంబ్లీలో ఎటూ మాట్లాడ్డానికి అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని, అలాంటి స‌భ‌కు వెళ్లినా, వెళ్ల‌క‌పోయాన ఒక‌టేన‌ని టీడీపీ భావ‌న‌. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని స‌మాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?