Advertisement

Advertisement


Home > Politics - Andhra

డ‌బ్బుల ద‌గ్గ‌ర చంద్ర‌బాబు ఎంపిక‌లు మారిపోయాయా?

డ‌బ్బుల ద‌గ్గ‌ర చంద్ర‌బాబు ఎంపిక‌లు మారిపోయాయా?

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల విష‌యంలో అనేక‌ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆఖ‌రి నిమిషంలో అభ్య‌ర్థుల‌ను మార్చి వేయ‌డం పెద్ద ర‌చ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కూ లెక్క‌లో లేని వారు, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిచ‌యం కూడా లేని వాళ్లు చాలా చోట్ల టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థులుగా మారారు! తెలుగుదేశం పార్టీకి అప్ప‌టి వ‌ర‌కూ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వేరే ఇన్ చార్జిలున్నారు. వారిలో కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు!

గ‌త ఐదేళ్ల‌లో వారు పార్టీ బాధ్య‌త‌ల‌ను కూడా మోశారు! అయితే అలాంటి వారిని కాద‌ని చంద్ర‌బాబు నాయుడు కొత్త వారిని తెర‌పైకి తెచ్చారు. వారిలో చాలా మందికి నియోజ‌క‌వ‌ర్గాల ఎల్ల‌లు అయినా తెలుసా అనేది ఒక సందేహం అయితే, వారి పేర్లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంత‌మందికి తెలుసు? అనేది మ‌రో ధ‌ర్మ‌సందేహం! ఈ రేంజ్ లో ఉన్నాయి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కామెడీలు! మ‌రి ఇంత‌కీ ఇలాంటి అనూహ్య‌మైన మార్పులు ఎందుకు జ‌రిగిన‌ట్టు? అంటే.. క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్న ఒకే ఒక స‌మాధానం డ‌బ్బు!

ఎవ‌రైతే బాగా ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రో, ఎవ‌రైతే డ‌బ్బులు ఉన్న‌ట్టుగా నిరూపించుకున్నారో వారికే చంద్ర‌బాబు నాయుడి అనుగ్ర‌హం ద‌క్కింద‌నేది క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్న మాట‌! ఆ నియోక‌వ‌ర్గంలో పేరున్న తెలుగుదేశం నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్నాళ్లూ ఇన్ చార్జిలుగా వ్య‌వ‌హరించిన వారు.. ఇలాంటి ఎన్ని బిరుదులున్నా చంద్ర‌బాబు అలాంటి వారిని అమాంతం ప‌క్క‌న పెట్టేశారు! నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌రిచ‌యాలు లేని వారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేంత సీన్ లేని వాళ్ల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు! ఇదంతా డ‌బ్బు మ‌హిమే అని టీడీపీ వాళ్లే చెబుతున్నారు. త‌మ‌కు టికెట్ ఎందుకు ద‌క్క‌లేదంటే.. వారు చెబుతున్న‌రీజ‌న్ ఇదే! ఇదేదో నిరాక‌ర‌ణ ఫ‌లితంగా వ‌స్తున్న మాట కాదు! వాస్త‌వంలో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది.

టికెట్ ను చంద్ర‌బాబు నాయుడు అమ్ముకున్నారంటూ కొంద‌రు బాహాటంగానే వ్యాక్యానిస్తున్నారు! టికెట్ ద‌క్క‌లేదు కాబ‌ట్టి వారు అలా మాట్లాడుతున్నార‌నేందుకు ఏమీ లేదు! నిజంగానే డ‌బ్బు బాగా ఖ‌ర్చు పెట్ట‌గ‌ల వారినే చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల విష‌యంలో స‌మ‌ర్థులుగా చూశార‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పేరు ప్ర‌ఖ్యాతుల‌తో నిమిత్తం లేకుండా.. కేవ‌లం ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రు అనే లెక్క‌ల‌తో ఆయ‌న టికెట్ ల‌ను ఖ‌రారు చేశార‌నే టాక్ వ‌స్తోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు కూడా చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

అనంత‌పురం అర్బ‌న్ స్థానంలో ప్ర‌భాక‌ర్ చౌద‌రి బ‌ల‌మైన క్యాండిడేట్. మాజీ ఎమ్మెల్యే, అర్బ‌న్ ఓట‌ర్ ను ప్ర‌భాక‌ర్ చౌద‌రి ఎంతో కొంత ఆక‌ట్టుకోగ‌ల‌డు కూడా! 2014 ఎన్నిక‌ల్లో చౌద‌రి ఇక్క‌డ నుంచి నెగ్గాడు. అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అనుభవం, చారిట‌బుల్ ట్ర‌స్టులు వంటివి చౌద‌రి నేప‌థ్యం.

గ‌త ఐదేళ్ల‌లో తెలుగుదేశం ఇన్ చార్జిగా వ్య‌వ‌హ‌రించాడ‌య‌న‌! ప్ర‌భాక‌ర్ చౌద‌రికే అనంత అసెంబ్లీ టీడీపీ టికెట్ ద‌క్కుతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అక్క‌డ ఎవ‌రికీ తెలియ‌ని అభ్య‌ర్థి తెర‌పైకి వ‌చ్చాడు! ఆయ‌న కూడా క‌మ్మ వ్య‌క్తే అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణం మాత్రం.. ధ‌నం అనే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది! ఎన్నిక‌ల్లో ఎలా ఖ‌ర్చుపెడ‌తారు? అనే ప్ర‌శ్న‌కు చౌద‌రి.. నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు పేర్ల‌ను ప్ర‌స్తావించార‌ట‌!

త‌ను ఇప్ప‌టికిప్పుడు 20 కోట్లో, ముప్పై కోట్లో సొంతంగా పెట్టే ప‌రిస్థితి లేద‌ని, అయితే త‌న త‌ర‌ఫున ప‌లువురు ఖ‌ర్చులు పెట్టుకోవ‌డానికి రెడీగా ఉన్న‌ట్టుగా చౌద‌రి చంద్ర‌బాబుకు వివ‌రించార‌ట‌! నియోజ‌క‌వ‌ర్గంలోని వ్యాపారులు,  ధ‌నికుల్లో వాళ్లు ఇంత పెడ‌తారు, వీళ్లింత పెడ‌తారు.. అంటూ ప్ర‌భాక‌ర్ చౌద‌రి లెక్క‌లు అప్ప‌జెప్పార‌ట చంద్ర‌బాబుకు!

అయితే.. వాళ్లూ వీళ్లు పెడ‌తార‌నే స‌మాచారానికి చంద్ర‌బాబు నాయుడు ఏ మాత్రం విలువ‌ను ఇవ్వ‌న‌ట్టుగా తెలుస్తోంది. అభ్య‌ర్థి వేరే వాళ్ల పేర్ల‌ను చెబితే చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని, సొంతంగా ఎంత పెడ‌తారు.. చేతిలో ఎంత డ‌బ్బుంది అనే లెక్క‌ల‌నే చంద్ర‌బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నార‌ని అనంత నుంచి టాక్ వినిపిస్తోంది. ఎవ‌రో వ‌స్తారు, ఎవ‌రో ఖ‌ర్చు పెడ‌తారు అని చెప్పే అభ్య‌ర్థులంద‌రినీ చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇందుకే తెలుగుదేశం అభ్య‌ర్థుల జాబితాలో అన్ని మార్పులున్నాయంటున్నారు.

రాజ‌కీయాల్లో చాలామంది అభ్య‌ర్థులు ఇలాంటి పెట్టుబ‌డుల‌నే న‌మ్ముకుంటారు. తాము గెలిస్తే అలా త‌మ త‌ర‌ఫున పెట్టుబ‌డి పెట్టిన వారికి లాభం చేకూర్చే ప‌నులు చేసి పెడ‌తారు. ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. అయితే అలాంటి వారిని చంద్ర‌బాబు ఎంట‌ర్ టైన్ చేయ‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.

సొంత డ‌బ్బుల‌ను క‌లిగి ఉండి, ముప్పై కోట్ల ఖ‌ర్చుకు అయినా లెక్క చేయ‌ని వారే చంద్ర‌బాబు అభ్య‌ర్థులు అయ్యార‌ని, ఈ లెక్క‌ల‌తో మాజీ ఎమ్మెల్యేల‌ను, ఇన్నాళ్లూ ప‌ని చేసిన ఇన్ చార్జిల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టార‌నే టాక్ వినిపిస్తోంది. ఇది ఒక్క అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో జ‌రిగిందే కాద‌ని, చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి అని స‌మాచారం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?