‘సెటిల్’ చేసుకోండి: బాబు హుకుం!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.  భారతీయ జనతా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయన జాబితాను ప్రకటించారు గానీ.. ఆ అభ్యర్థులందరూ సేఫ్…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు.  భారతీయ జనతా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయన జాబితాను ప్రకటించారు గానీ.. ఆ అభ్యర్థులందరూ సేఫ్ జోన్ లోనే ఉన్నారా? అనేది పార్టీలోనే సందేహం.

సేఫ్ జోన్ అనగా ఎన్నికల్లో గెలిచే స్థితిలో ఉన్నారా లేదా అనేది తర్వాతి సంగతి. కనీసం ఎన్నికల్లో తలపడే సమయంలో.. అసంతృప్తుల వెన్నుపోటులకు గురి కాకుండా, జనసేన పార్టీ నాయకుల సహాయ నిరాకరణతో సతమతం కాకుండా ముందుకు సాగే స్థితిలో ఉన్నారా లేదా? అనేది చాలా పెద్ద సంగతి. ఈ కోణంలో చూసినప్పుడు చాలా కొద్ది నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా.. పరిస్థితి సాఫీగా లేదు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. ఎక్కడికక్కడ ‘సెటిల్మెంట్లు’ చేసుకోవాల్సిందిగా అభ్యర్థులకు సంకేతాలు ఇచ్చేశారు.

పేర్లు ప్రకటించిన అభ్యర్థులందరితోనూ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబునాయుడు.. స్థానికంగా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్త నాయకుల్ని, జనసేన నాయకుల్ని ముందే దారిలో పెట్టుకోవాలని వారిని హెచ్చరించారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే.. ఒకటికి పదిసార్లు స్వయంగా మీరే వెళ్లి కలవండి. నేనే అభ్యర్థిని అనే అహంతో వ్వవహరిస్తే కుదరదు.. జనసేన నేతలను గౌరవించాలి.. అంటూ చంద్రబాబునాయుడు పార్టీ అభ్యర్థులకు చేసిన దిశానిర్దేశం అచ్చంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినదే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికల పట్ల సహజంగానే నియోజకవర్గాల్లో వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. పైగా జనసేన, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే ఆ పార్టీలో చాలా మందికి ఇష్టం లేదు. వారందరూ టీడీపీపై గుర్రుగా ఉన్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయానికి సహకరిస్తారనే గ్యారంటీ కూడా లేదు. వారిని దార్లోకి తెచ్చుకోడం, బుజ్జగించడం గురించి చంద్రబాబు చెప్పడం అంటే.. వారందరినీ నోట్ల కట్టలతో జో కొట్టమనే అర్థం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం ఆశించేవాళ్లు ఒకరికంటె ఎక్కువమందే ఉంటారు. ఒకరిని ఎంపిక చేసిన తర్వాత మిగిలిన వారిని బుజ్జగించడం.. పార్టీ అభ్యర్థికి వారు పూర్తిస్థాయిలో సహకరించేలా చూడడం పార్టీ హైకమాండ్ బాధ్యత. కానీ పార్టీ మీద, స్థానిక నాయకుల మీద చంద్రబాబునాయుడుకు కనీసంగా కూడా పట్టు లేదనే మాట స్పష్టం. ఆయన చెబితే వినేవారు గానీ, పార్టీకోసం పనిచేసేవారుగానీ లేరు. అందుకే ఆయన నాయకుల్ని బుజ్జగించుకునే బాధ్యత అభ్యర్థులకే వదిలేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీచేయడానికి తగిన ఖర్చులకు ప్రిపేర్ అవుతారు గానీ.. ఈ అసంతృప్తులను తామే బుజ్జగించుకోవాలంటే.. వారి గొంతెమ్మ కోరికలను తీర్చాలని, అది ఇంకా పెద్ద ఖర్చు అవుతోందని అభ్యర్థులు బాధ పడే పరిస్థితి. ఇంతా కలిపి కోట్లలో డబ్బులు పంచినా.. అందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తారో లేదోననే భయం కూడా వారిని వెంటాడుతోంది.