తన తండ్రి చంద్రబాబునాయుడిని ఎలాగైనా జైలు నుంచి బయటికి తెచ్చేందుకు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చల్లో లోకేశ్ బిజీగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అసలు కథ వేరే. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తనను అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఢిల్లీని విడిచిపెట్టి లోకేశ్ రాలేదని జనం అనుకుంటున్నారు. ఈ నెల 29 రాత్రి నుంచి తిరిగి యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభిస్తారని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ముందుగా ప్రకటించింది.
ఆ తర్వాత పాదయాత్రపై తూచ్ తూచ్ అంటూ యూటర్న్ తీసుకుంది. అదేమంటే …ఢిల్లీలో ఇంకా లోకేశ్ చక్కబెట్టాల్సిన పనులున్నాయని, కావున అవి తేలే వరకూ ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రారని చావు కబురు చల్లగా చెప్పడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కాసేపటి క్రితం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోకేశ్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని లోకేశ్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సందర్భంలో కోర్టు ఆదేశాల మేరకు లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇచ్చేందుకు ఆరుగురితో కూడిన సీఐడీ బృందం ఢిల్లీకి బయల్దేరింది. తనను ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేయలేనంత దుస్థితిలో సీఐడీ ఉందా? అని ఇటీవల లోకేశ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
తాజా పరిణామాలు చూస్తుంటే, లోకేశ్ కోసం జైలు ఊచలు ఎదురు చూస్తున్నట్టుగా వుంది. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ఎవరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, వారికి పదవుల పంపకాల్లో అంత ప్రాధాన్యం వుంటుందని లోకేశ్ పదేపదే చెప్పేవారు. అదేంటోగానీ, తన వరకూ వచ్చే సరికి …బెయిల్ కోసం పరితపిస్తున్నారు. ఏది ఏమైతేనేం అరెస్ట్ భయంతో లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌కు రాకపోతేనేం, సీఐడీ అధికారులే ఆయన దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు నోటీసుల వరకే పరిమితమై, ఆ తర్వాత కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.