తమను పరిగణలోకి తీసుకోకుండా, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆ రాష్ట్ర వామపక్షాలు రగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ తమను మోసగించిందని సీపీఐ, సీపీఎం పార్టీల ఆరోపణ. మునుగోడు ఉప ఎన్నికలో తమను వాడుకుని, అసలైన ఎన్నికలు వచ్చే సరికి పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్‌ను ఓడించాలనే పట్టుదలతో వామపక్ష పార్టీలున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ విరుచుకుపడ్డారు. తెలంగాణ పర్యటనలో భాగంగా కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏలో చేరుతానని కేసీఆర్ తనతో అన్నారని, కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఆశీస్సులు కోరారని మోదీ అన్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనల్ని తాను వ్యతిరేకించానని మోదీ చెప్పడం తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది.
మోదీ విమర్శల్ని రాజకీయ అస్త్రాలుగా ప్రత్యర్థులు వాడుకుంటున్నారు. మోదీ కామెంట్స్‌పై సమాధానం చెప్పాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్‌ను అనుమానించాల్సి వస్తుందన్నారు. ఎన్డీఏలో చేరాలని కేసీఆర్ ఎప్పుడో ప్రతిపాదిస్తే ఇప్పుడెందుకు బయట పెట్టారని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్, వైసీపీ నేతలున్నారని ఆయన అన్నారు. దేశంలో నిజమైన కూటమి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అని ఆయన ఆరోపించారు. ఒకవేళ మళ్లీ మోదీనే ప్రధాని అయితే దేశం ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడిపోతుందని ఆయన సంచలన కామెంట్ చేశారు.
నిన్న మొన్నటి వరకూ బీజేపీపై పోరాడే యోధుడిగా వామపక్షాల నేతలకు కేసీఆర్ కనిపించారు. ఎప్పుడైతే వారితో సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించారో, ఆ క్షణం నుంచే కేసీఆర్‌పై రాజకీయ దాడి మొదలు పెట్టారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు సంబంధాలు ఉండడం వల్లే తమతో పొత్తు పెట్టుకోలేదనే వాదనను వామపక్షాల నేతలు తెరపైకి తెచ్చారు. ఆ కోణంలోనే తాజా విమర్శల్ని చూడాల్సి వుంటుంది.