Advertisement

Advertisement


Home > Politics - Andhra

అచ్చెన్నతో ఆడపులి సమరం

అచ్చెన్నతో ఆడపులి సమరం

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడుని ఓడించాలన్నది జగన్ పంతం. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు చాలానే మాట్లాడారు. దాంతో వైసీపీ అచ్చెన్నని అసెంబ్లీకి రాకుండా చూడాలనుకుంది. 2019లో జగన్ గాలి శ్రీకాకుళం అంతా వీచింది. చాలా మంది ఓడారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం నెగ్గారు.

అలా అచ్చెన్న బాకీ ఉండిపోయింది. 2024 ఎన్నికలతో ఆ శేషాన్ని తీర్చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. అచ్చెన్నను ఓడించడానికి ఎవరు అంటే దువ్వాడ శ్రీనుని మొదట అనుకున్నారు. ఆయనకే గత నాలుగేళ్లుగా ఇంచార్జి ఇచ్చారు. ఎమ్మెల్సీని చేశారు.

అయితే దువ్వాడను ముందు పెడితే సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండడంతో పాటు వర్గ పోరు అచ్చెన్న విజయానికి దారితీస్తుందని గ్రహించిన వైసీపీ ఆయన సతీమణి దువ్వాడ వాణిని పోటీలోకి దింపుతోంది. ఆమె జెడ్పీటీసీగా ఉన్నారు. మహిళా నాయకురాలిగా చురుకుగా ఉన్నారు.

బలమైన కాళింగ సమాజిక వర్గానికి చెందిన ఆడపడుచు. ఆమె పట్ల వైసీపీ మొత్తంలో ఏకాభిప్రాయం ఉంది. ఆ విధంగా వాణి అభ్యర్ధి అవుతున్నారు. అచ్చెన్న మీద వైసీపీ నుంచి ఆడపులిగా సమరానికి సై అంటున్నారు. టెక్కలి నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు.

దువ్వాడ వాణి అభ్యర్ధిత్వం అయితే ఆ ఓట్లు అన్నీ ఏకీకృతం అవుతాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అచ్చెన్నను ఈసారి అసెంబ్లీకి రాకుండా చేయడమే టార్గెట్ గా వైసీపీ ఎంతో వ్యూహాత్మకంగా వాణిని ముందు పెట్టింది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో అధికార పార్టీ తొలి అభ్యర్ధిని ప్రకటించింది. అది కూడా సెంటిమెంట్ జిల్లాగా ఉన్న శ్రీకాకుళం నుంచే కావడం విశేషం. 

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ నే ఓడించే అభ్యర్ధిని ప్రకటించామని వైసీపీ నేతలు అంటున్నారు. ఆడపులిగా ఎన్నికల రంగంలోకి దువ్వాడ వాణి వస్తే వైసీపీ అంతా ఒక్కటైతే టెక్కలిలో టీడీపీకి కష్టమే అన్న మాట ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?