Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆమెకు గోతులు త‌వ్వుతున్న వైసీపీ పెద్ద మ‌నిషెవ‌రు?

ఆమెకు గోతులు త‌వ్వుతున్న వైసీపీ పెద్ద మ‌నిషెవ‌రు?

వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శిస్తుంటాయి. జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ఏ మాత్రం ర‌క్ష‌ణ లేద‌ని ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డాన్ని చూశాం. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం వాసిరెడ్డి ప‌ద్మ నేతృత్వంలో మ‌హిళా క‌మిష‌న్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా క‌ర్రి జ‌య‌శ్రీ‌, గ‌జ్జ‌ల ల‌క్ష్మి, బూసి వినీత‌, రుకియా బేగం, గెడ్డం ఉమాల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. వీరంతా త‌మ‌కు కేటాయించిన ప‌రిధుల్లో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ప‌ని చేస్తుంటారు.

వీరిలో గ‌జ్జ‌ల ల‌క్ష్మి తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ టీడీపీకి ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. ఆమె పోస్టులోని ముఖ్య పాయింట్స్ గురించి తెలుసుకుందాం.

"నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. నా వెనక గోతులు తవ్వాలని, నా మీద తప్పుడు మాటలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మిమ్మల్ని ఆ దేవుడే చూస్తాడు. ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ముఖ్యమంత్రి గారు చెబితే ఈ క్షణాన ఈ పదవి వదిలి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆమె త‌న ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి అవ‌కాశం క‌ల్పించ‌లేదంటే... ఆమె వైసీపీ పెద్ద వాళ్ల‌నే టార్గెట్ చేశార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే మ‌హిళా క‌మిష‌న్ స‌భ్య‌త్వాన్ని కూడా విడిచిపెట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యారంటే... గ‌జ్జ‌ల ల‌క్ష్మిని ఎవ‌రో పెద్ద నాయ‌కులు బాగా ఇబ్బంది పెడుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. త‌న‌పై త‌ప్పుడు మాట‌లు చెబుతున్నార‌ని, అలాగే గోతులు త‌వ్వాల‌ని చూస్తున్నార‌నే పెద్ద పెద్ద మాట‌ల‌ను వాడ‌డంతో మ‌హిళా క‌మిష‌న్ మెంబ‌ర్‌కే జ‌గ‌న్ పాల‌న‌లో దిక్కు లేక‌పోతే, ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌ల‌కు దిగారు. వైసీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఏ పాటిదో... మ‌హిళా క‌మిష‌న్ మెంబ‌ర్ తాజా పోస్టే నిద‌ర్శ‌న‌మ‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు దెప్పి పొడుస్తున్నారు.

గ‌జ్జ‌ల ల‌క్ష్మికి ప్ర‌శ్నించే గుణం వుంద‌నే ఉద్దేశంతో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌రరెడ్డి మ‌హిళా క‌మిష‌న్ మెంబ‌ర్‌గా ఇవ్వాల‌ని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యేపై గౌర‌వంతో ఆమెకు కీల‌క ప‌ద‌వి ఇచ్చారు. ఎమ్మెల్యే అంచ‌నాల‌కు మించిపోయారామె. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ఆమె త‌న బాధ‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఇటీవ‌ల ఇక‌పై తాను సోష‌ల్ మీడియాకు దూరంగా వుంటాన‌ని ప్ర‌క‌టించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కొంత కాలం సోష‌ల్ మీడియాకు దూరంగా వున్నారు. మ‌ళ్లీ య‌ధాప్ర‌కారం పోస్టులు పెట్ట‌డం స్టార్ట్ చేశారు. త‌న బాధ‌ల‌ను ఎవ‌రికీ చెప్పుకోలేక సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారేమో అనే సానుభూతి కొంద‌రి నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?