ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీలో చురుకుగా ఉన్న ముగ్గురు మాజీ మంత్రులలో ఇద్దరు అరెస్టుల దాకా వెళ్లారు. కేసులు పెట్టించుకున్నారు. అందరికంటే ముందు టీడీపీలో అత్యంత సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పదిహేను కేసులు పెట్టించుకుని తమ అధినేత చంద్రబాబు కళ్లల్లో ఆనందాన్ని చూశారు.
నోరుకు పని చెప్పి పెట్టించుకున్న కేసులే ఇవన్నీ దాదాపుగా కావడం విశేషం. అయ్యన్నపాత్రుడు నోరు తెరిస్తే చాలు ముఖ్యమంత్రి జగన్ మీద అనుచితమైన భాష వాడుతూ కేసుల దాకా వెళ్లారు. కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఉన్నత పదవులు అన్న చినబాబు మాటతో ఏకీభవించి అదే బాటలో నడుస్తున్నారు అయ్యన్న అని సెటైర్లు ఉండనే ఉన్నాయి.
ఆయన తరవాత వరసలో నేను అంటూ మరో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నోటితోనే పోరాటం చేస్తూ అరెస్ట్ దాకా వెళ్లారు. ఆయన జగన్ తో పాటు మహిళా మంత్రి రోజా మీద విరుచుకుపడిన ఫలితంగా గుంటూరు పోలీసులు ఆయన ఉన్న ఇంటికే వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు.
ఇపుడు అందరి దృష్టి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద పడింది. అయితే పైన ఇద్దరి మాదిరిగా గంటాను అరెస్ట్ చేయడం అంత సులువు కాదు. ఆయన నోటికి పని చెప్పరు. వ్యూహాలతోనే ముందుకు సాగుతారు. ఆయన మాట కూడా సబబుగానే ఉంటుంది. మరి గంటాను అరెస్ట్ చేయడం ఎలా అంటే దానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయని అంటున్నారు.
గంటా మంత్రిగా ఉన్నపుడు విశాఖలో భూ దందాలో ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూ దందా మీద రెండు సిట్లు పడ్డాయి. ఆ నివేదికలను బయటకు తీస్తే గంటా కూడా అరెస్ట్ అవడం ఖాయమని అంటున్నారు. గంటా జగన్ అవినీతి పరుడు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించి వచ్చారు అని మాట్లాడడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
తమ నేత మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని టీడీపీ నేతల అవినీతి మీద కేసులు పెడితే జైళ్ళు అసలు సరిపోవని అంటున్నారు. ఇపుడు అందరి దృష్టి గంటా మీద ఉంది. ఆయన అరెస్ట్ ఉంటుందా అని తమ్ముళ్ళు కలవరపడుతున్నారు.