భీమిలీ సీటు విషయంలో గంటా వర్సెస్ పవన్!

విశాఖ జిల్లాలోని భీమిలీ మీద టీడీపీ జనసేన గట్టిగా దృష్టి పెట్టేశాయి. ఈ సీటు చాలా కీలకం అని రెండు పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీకి కంచుకోట లాంటి సీటు భీమిలీ. అందుకే ఆ పార్టీ…

విశాఖ జిల్లాలోని భీమిలీ మీద టీడీపీ జనసేన గట్టిగా దృష్టి పెట్టేశాయి. ఈ సీటు చాలా కీలకం అని రెండు పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీకి కంచుకోట లాంటి సీటు భీమిలీ. అందుకే ఆ పార్టీ కూడా ఇచ్చేందుకు వెనకాడడంలేదు. అంతే కాదు భీమిలీలో గెలిస్తే ఏపీలో అధికారంలోకి వస్తామన్న సెంటిమెంట్ కూడా ఉంది.

భీమిలీ సీటు విషయంలో జనసేన తమదే అంటోంది. పవన్ కూడా సీరియస్ గా తీసుకున్నారు అని వినిపిస్తోంది. ఇపుడు ఉన్నట్లుండి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలీ మీద ఫోకస్ పెట్టేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు.

భీమిలీలో తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద గంటా ఒక సర్వే చేయించుకుంటే గెలుపు ఖాయం అని వచ్చిందట. దాంతో ఆయన భీమిలీ నుంచే పోటీ అని నిర్ణయించారు. గంటా ఇపుడు భీమిలీ సీన్ లోకి రావడంతో ఒక్కసారిగా జనసేన టీడీపీల మధ్య సీటు వార్ రాజుకుంది.

ఈ సీటు ఆరు నూరు అయినా జనసేన తీసుకుని పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో దాదాపుగా లక్ష ఓట్లు సాధించిన టీడీపీ సీటుని 24 వేలు మాత్రమే తెచ్చుకున్న జనసేనకు ఎలా వదులుకుంటుంది అని ఆ పార్టీ వారు ప్రశ్నిస్తున్నారు. భీమిలీని వదులుకుంటే టీడీపీకి తీవ్రంగా రాజకీయ నష్టం జరిగే అవకాశం ఉంది అంటున్నారు

ఈ సీటు విషయంలో చంద్రబాబు వద్దనే తేల్చుకోవాలని జనసేన చూస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సీటు విషయంలో రెండు మూడు రకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే కాపు లేకపోతే బీసీ అభ్యర్ధిని ఇక్కడ పోటీకి దించి అయినా టీడీపీ నుంచి తీసుకోవాలని చూస్తున్నారు.

అక్కడికీ కుదరకపోతే తానే పోటీ చేయడానికి ముందుకు రావాలని ఆయన చూస్తున్నారు అని ప్రచారం అయితే ఉంది. గత ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి భీమిలీని ఎంచుకుంటారు అని అంటున్నారు. గంటా కనుక పట్టుబడితే పవన్ రంగంలోకి దిగిపోతారు అని అంటున్నారు.

గంటా అయితే మెగా ఫ్యామిలీతో ఉన్న పరిచయాల దృష్ట్యా చిరంజీవి ద్వారా కూడా వత్తిడి పెంచి తాను భీమిలీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. భీమిలీలో జనసేన టీడీపీలలో మొదలైన సీటు వార్ వైసీపీకి అనుకూలంగా మారుతోందని అంటున్నారు. ఎవరికి సీటు దక్కినా రెండవ పక్షం మనసు పెట్టి పనిచేయకపోతే మరోమారు వైసీపీ గెలిచి తీరుతుందని అంటున్నారు. గంటాకు జనసేన విషయంతో పాటు సొంత పార్టీలో కూడా ప్రత్యర్ధి వర్గం కూడా బ్రేకులు వేస్తోంది అని టాక్ ఉంది.