భీమునిపట్నం ఎపుడో వందేళ్ల క్రితం ఒక వెలుగు వెలిగింది. సౌతిండియాలో తొలి మున్సిపాలిటీ భీమిలీలోనే 1861లో ఏర్పాటు అయింది. భీమిలీలోనే ఓడరేవుని డచ్చివారు అభివృద్ధి చేశారు. కాలక్రమంలో విశాఖకు ప్రాధాన్యత పెరిగి భీమిలీ వైభవం కరిగింది. అటువంటి భీమిలీకి ఇపుడు మహర్దశ పట్టబోతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయదశమి నుంచి విశాఖలో మకాం పెడుతున్నారు. ఆయన నివాసం ఉండే రుషికొండ భీమిలీ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీసుతో పాటు కీలక మంత్రిత్వ శాఖలు క్యాంప్ ఆఫీసులు అక్కడే వస్తున్నాయి.
భీమిలీ నియోజకవర్గం ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోతోంది. అధికారుల హడావుడి మధ్యన భీమిలీ ఇపుడు బిజీగా మారింది. భీమిలీ పరిధిలోని మధురవాడ ఐటీ హిల్స్ మీద అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. గత పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదానీ డేటా సెంటర్ కి ప్రారంభోత్సవం చేశారు.
అక్టోబర్ 16న ముఖ్యమంత్రి జగన్ భీమిలీ పరిధిలో ఇన్ఫోసిస్ సెంటర్ ని ప్రారంభించనున్నారు. దాదాపుగా వంద కోట్లతో భీమిలిలో పెట్టుబడులు వస్తాయని రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రానున్న రోజులలో భీమిలీ చుట్టూ అభివృద్ధి అంతా తిరగనుందని ఆయన వెల్లడించారు. ఒకనాటి వైభవం అంతా మళ్ళీ ఇపుడు భీమిలీ చూడనుందని అంటున్నారు.