
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం జగన్ దేశ రాజధాని పర్యటన టీడీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నెలక్రితం వరకూ జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ సెటైర్స్ విసిరేది. తన కేసులపై ముందుకెళ్లకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో బేరానికి వెళుతున్నట్టు విమర్శించేవారు. ఇప్పుడు సీన్ మారింది.
స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మరింత ఉచ్చు బిగించడానికే జగన్ ఢిల్లీ వెళుతున్నారనే అనుమానం, భయం టీడీపీని పట్టి పీడిస్తున్నాయి. స్కిల్ స్కామ్‌తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ తదితర కేసుల్లో బాబును ఇరికించి జైలుకే పరిమితం చేస్తారనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీ పర్యటనలో మోదీ, అమిత్‌షాలతో కేసులపై జగన్ చర్చిస్తారని, అవి చంద్రబాబుకు సంబంధించి అని టీడీపీ, ఎల్లో మీడియా కొత్త పల్లవి అందుకున్నాయి. కేంద్ర పెద్దల ప్రమేయంతోనే బాబును జైలుకు పంపారని ఏపీ సమాజం నమ్ముతోంది. మోదీ, అమిత్‌షా తలచుకుంటే ఇప్పట్లో చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే భారీ ప్రణాళికే ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరినీ వివిధ కుంభకోణాల్లో ఇరికించే వ్యూహం పకడ్బందీగా అమలవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎంతో పకడ్బందీగా సీఐడీ కేసుల నమోదు మొదలుకుని, న్యాయస్థానాల్లో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని రకాలుగా ఆధారాలను సేకరించిందని సమాచారం.
చంద్రబాబు కుటుంబ సభ్యులపై కేసుల నమోదును సీఎం జగన్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తప్పించుకోడానికి చిన్న అవకాశం కూడా న్యాయ నిపుణులతో జగన్ తరచూ చర్చిస్తున్నారని తెలిసింది. చంద్రబాబు అరెస్ట్, ఇతర అవినీతి కేసుల్లో ఆయన కుటుంబ సభ్యుల పాత్రపై కూడా కేంద్ర పెద్దలకు జగన్ నివేదించే అవకాశం వుంది. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం అంటేనే ... ఏపీ ప్రభుత్వ చర్యలపై సానుకూల సంకేతాలు ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
అందుకే టీడీపీ నేతలు భయపడుతున్నారు. నారా లోకేశ్ గత నెల 14 నుంచి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. లోకేశ్ ఢిల్లీలో వుండగానే, జగన్ ఈ నెల 6,7 తేదీల్లో అక్కడ గడపనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత బాబు కేసులపై ఎలాంటి వ్యూహంతో వెళ్లారో అనే భయం టీడీపీకి నిద్ర కరవు చేస్తోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా