క‌డ‌ప వైసీపీకి కంచుకోటే… కానీ!

ముస్లిం మైనార్టీలు ఆధిప‌త్యం చెలాయించే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ప్ప‌ని స‌రిగా గెలుస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు సైతం చెప్పే మాట‌. అలాంటి వాటిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప కూడా వుంది. వైఎస్సార్…

ముస్లిం మైనార్టీలు ఆధిప‌త్యం చెలాయించే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌ప్ప‌ని స‌రిగా గెలుస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు సైతం చెప్పే మాట‌. అలాంటి వాటిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప కూడా వుంది. వైఎస్సార్ జిల్లా కేంద్ర‌మైన క‌డ‌ప‌లో ముస్లిం మైనార్టీలు అధికం. ఆ త‌ర్వాత క్రిస్టియ‌న్లు, బ‌లిజ‌లు, రెడ్లు, ఇత‌ర కులాలున్నాయి. గ‌తంలో ఖ‌లీల్‌బాషాకు టీడీపీ క‌డ‌ప టికెట్ ఇచ్చింది. టీడీపీ అధికారంలోకి రావ‌డం, ఆయ‌న మంత్రిగా ప‌ని చేయ‌డం.. అంతా గ‌తం. 2019లో అమీర్‌బాబు అనే మైనార్టీ నేత‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.

ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ, అనంత‌రం వైసీపీ క‌డ‌ప సీటును ముస్లింల‌కే కేటాయించాయి. క‌డ‌ప నుంచి 2014, 2019ల‌లో వ‌రుస‌గా రెండు సార్లు వైసీపీ త‌ర‌పున అంజాద్ బాషా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, జ‌గ‌న్ కేబినెట్‌లో అంజాద్‌బాషాకు చోటు ద‌క్క‌డం తెలిసిన విష‌యాలు. ప్ర‌స్తుతం అంజాద్ బాషా డిప్యూటీ సీఎం హోదాలో అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అంజాద్‌బాషా త‌మ్ముడు, ఇత‌ర బంధువుల వైఖ‌రితో క‌డ‌ప‌లో వైసీపీపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా త‌మ్ముడు అహ్మ‌ద్‌బాషా  పోలీస్‌స్టేష‌న్‌లోనే క‌డ‌ప టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వీరెడ్డి, ఆమె భ‌ర్త అయిన క‌డ‌ప లోక్‌స‌భ అభ్య‌ర్థి శ్రీ‌నివాస్‌రెడ్డిపై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ త‌ప్పు ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో జ‌రుగుతున్న చ‌ర్చ ఏంటంటే… ఇది ముమ్మాటికీ హిందువుల మ‌నోభావాల‌పై జ‌రిగిన దాడిగా భావిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ అండ చూసుకుని అహ్మ‌ద్‌బాషా, అత‌ని త‌మ్ముడు, బంధువులు క‌డ‌ప‌లో చెల‌రేగిపోతున్నార‌ని , ఇలాగైతే ఇత‌ర వ‌ర్గాలు బ‌తికేదెట్టా? అని వైసీపీ అభిమానులు సైతం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

వైసీపీ అధిష్టానం క‌డ‌ప విష‌యంలో జోక్యం చేసుకుని దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే మాత్రం… క‌డ‌ప‌లో రాజ‌కీయం త‌ల‌కిందులైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌నే మాట వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం త‌మ్ముడి నోటి దురుసు… క‌డ‌ప‌లో మ‌తాల అంశం మొట్ట‌మొద‌టిసారిగా తెర‌పైకి తీసుకొచ్చింది. సున్నిత‌మైన అంశం అయిన‌ప్ప‌టికీ వాస్త‌వాలు మాట్లాడుకోవాలంటే… త‌మ మ‌తానికి చెందిన మ‌హిళ‌పై ఏంటా నోటి దురుసు కామెంట్స్ అని రాజ‌కీయాల‌కు అతీతంగా ఆవేద‌న వెల్ల‌డిస్తున్నారు.

అంజాద్ బాషా త‌మ్ముడి దురుసు కామెంట్స్‌ను ముస్లింలు సైతం వ్య‌తిరేకిస్తున్నారంటే… క‌డ‌ప‌లో అస‌లేం జ‌రుగుతున్న‌దో వైసీపీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది. క‌డ‌ప మ‌న అడ్డా, మ‌న కంచుకోట అనే భ్ర‌మ‌ల్లో వుంటే ఎవ‌రేం చేయ‌లేరు. కానీ వైసీపీ కంచుకోట‌లో అంజాద్ బాషా కుటుంబ స‌భ్యుల అరాచ‌కాల‌తో వైసీపీకి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని సొంత పార్టీ శ్రేణులు సైతం ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి.