కొణతాలకు సీటు దాడి ఏం చేస్తారో?

అనకాపల్లి అసెంబ్లీకి జనసేన తరఫున మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు సీటు ఖరారు అయింది. అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసిన ఈ సీనియర్ నేత ఎంచుకున్న పార్టీ జనసేన. పోటీ చేయాలని…

అనకాపల్లి అసెంబ్లీకి జనసేన తరఫున మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు సీటు ఖరారు అయింది. అయిదేళ్ల పాటు రాజకీయ అజ్ఞాత వాసం చేసిన ఈ సీనియర్ నేత ఎంచుకున్న పార్టీ జనసేన. పోటీ చేయాలని చూసింది అనకాపల్లి నుంచి ఎంపీగా. అయితే సడెన్ గా మెగా బ్రదర్ నాగబాబు రంగ ప్రవేశం చేయడంతో ఆయన ఆశలకు బ్రేక్ పడింది.

ఆ మీదట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా కొణతాల ఇంటికి వెళ్ళి జరిపిన చర్చల పర్యవసానంగా కొణతాలకు అనకాపల్లి అసెంబ్లీ సీటు దక్కింది. అయితే ఈ సీటులో పోటీకి ఆయన రెడీ అయినా మద్దతు ఇచ్చే పార్టీగా టీడీపీ నుంచి ఎంతవరకూ సహకారం లభిస్తుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటిదాకా వైసీపీలో ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇటీవలే సైకిలెక్కేశారు. తన సొంత ఇంటికి అలా వచ్చి చేరారు. ఆయన తన కుమారుడు దాడి రత్నాకర్ కి అనకాపల్లి టికెట్ ఆశిస్తున్నారు. కొణతాలకు దాడికి మధ్య రాజకీయ వైరం ఉందని టాక్. ప్రత్యర్ధులుగా దశాబ్దాల పాటు రాజకీయాలు చెరో పార్టీ నుంచి చేశారు.

ఇపుడు దాడి కొణతాలకు హెల్ప్ చేస్తారా అన్నది చూడాలని అంటున్నారు. మరో వైపు చూస్తే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సీటు తనదే అని అనుకుంటూ వచ్చారు. ఆయన వర్గం నిరాశలో ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు వర్గం కూడా తమకు టికెట్ దక్కలేదన్న ఆవేదనతో ఉంది.

జనసేనలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువు అయిన పరుచూరి భాస్కరరావు టికెట్ ఆశిస్తూ వచ్చారు. ఆయన ఎంతమేరకు సహకరిస్తారు అన్నది చూడాలని అంటున్నారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నందున కొణతాల వర్గం అయితే అంత యాక్టివ్ గా లేదు అని అంటున్నారు. దాంతో సొంత బలం కూడగట్టుకోవడమే కాకుండా అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుంది. టికెట్ దక్కింది, ఇక ముందు ఉన్నదే అసలైన పండుగ అని అంటున్నారు.