Advertisement

Advertisement


Home > Politics - Andhra

లై డిటెక్టర్ కు రెడీ అంటున్న కేటీఆర్!

లై డిటెక్టర్ కు రెడీ అంటున్న కేటీఆర్!

తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ముదురుతున్న కొద్దీ అసలు సూత్రధారులుగా భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకులు పలువురు ఉన్నారనే అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఫోన్ టాపింగ్ వెనుక కల్వకుంట్ల తారక రామారావు పాత్ర ఉన్నదనే వాదన రాజకీయ వర్గాలలో విస్తృతంగా చలామణి అవుతోంది.

కేటీఆర్ త్వరలోనే అరెస్టు కాక తప్పదని ఆయన పాత్రకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా దొరికాయని ఇలా రకరకాలుగా కొన్ని మీడియా చానళ్లు, యూట్యూబ్ ఛానల్ లలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వార్తా కథనాలతో అసహనానికి గురవుతున్న కేటీఆర్ సరైన వివరణ ఇవ్వకపోతే వారందరి మీద పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు కూడా పంపారు.

ఇలాంటి నేపథ్యంలో ఒక టీవీ ఛానల్ కు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చిన కల్వకుంట్ల తారక రామారావు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనకు ఎంత మాత్రమూ సంబంధం లేదని కొండ బద్దలు కొట్టి చెప్పారు. తనకు టాపింగుకు ఎలాంటి లింకు లేదని ఆయన చెప్పుకున్నారు. అధికారులు ఎవరైనా టాపింగుకు పాల్పడి ఉంటే ఆ తప్పుకు వారు శిక్ష అనుభవిస్తారని కూడా అన్నారు.

అయితే ఈ సందర్భంగా ఫోన్ టాపింగ్ తో తనకు సంబంధం ఉన్నదో లేదో తేల్చడానికి లై డిటెక్టర్ పరీక్ష స్వీకరించడానికి అయినా తాను సిద్ధమే అంటూ కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. కేవలం లై డిటెక్టర్ పరీక్ష మాత్రమే కాదు, అవసరమైతే నార్కో అనాలసిస్ టెస్ట్ స్వీకరించడానికి కూడా సిద్ధమేనని కేటీఆర్ ప్రకటించారు.

అయితే ఇలాంటి లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు ఆయన. రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులైనటువంటి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి తదితరుల ఫోన్లు టాపింగ్ చేయిస్తున్నారని, వారి రహస్యాలను తెలుసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదేవిధంగా కిషన్ రెడ్డికి కూడా ఫోన్ టాపింగ్‌తో సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారు.

ఆ ఇద్దరు నాయకులు కూడా తనతో పాటు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమైతే మాత్రమే, తాను కూడా చేయించుకుంటానని కేటీఆర్ చెప్పడం విశేషం. తన మీద ఆరోపణలు వినిపిస్తున్నట్లే వాళ్ల మీద కూడా ఉన్నాయని ఆయన చాలా గట్టిగా సమర్ధించుకున్నా రు. ఏదో మీడియా ముందు నాటకీయంగా సవాలు విసిరారు గానీ.. ఇందులో చాలా డొల్లతనం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కాంగ్రెస్ నాయకుల ఫోన్లు టాపింగ్ జరిగాయని, టాపింగ్ చేయడం వెనుక కేటీఆర్ హస్తం ఉందనేది పట్టుబడిన పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన వాంగ్మూలం నుంచి రాబట్టిన సంగతి. అదే సమయంలో రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలు కేవలం కేటీఆర్ యొక్క రాజకీయ ఆరోపణలు మాత్రమే.

విచారణలో భాగంగా మీ పేరు వచ్చినప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ అవసరమైతే చేయించవచ్చు గాక. కానీ కేవలం రాజకీయ నిందలుకు సమాధానం ఇవ్వడానికి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఆ పరీక్షకు వస్తారని కేటీఆర్ ఎలా ఊహించారో ఎవరికీ అర్థం కావడంలేదు.

కేటీఆర్ తాను సచ్ఛీలుడినని, సచ్ఛరిత్రుడనని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఫోన్ టాపింగ్ లో వెల్లడవుతున్న వివరాలను, బట్టి మరికొద్ది రోజుల్లో గులాబీ కీలక నేతల పాత్ర బయటకు రావడం తథ్యం అని తెలంగాణ సమాజానికి అర్థమవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?