మీడియా కోసం టీడీపీ, జ‌న‌సేన బిల్డ‌ప్‌!

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య గంద‌ర‌గోళం పెరుగుతోంది. అస‌లేం చేస్తున్నారో వాళ్ల‌కే తెలియ‌డం లేదు. ఎప్పుడేం చేయాలో అర్థం కాని అయోమ‌య ప‌రిస్థితుల్లో ఇరు పార్టీల నేత‌లున్నారు. ఇవాళ విజ‌యవాడ‌లో టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య…

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య గంద‌ర‌గోళం పెరుగుతోంది. అస‌లేం చేస్తున్నారో వాళ్ల‌కే తెలియ‌డం లేదు. ఎప్పుడేం చేయాలో అర్థం కాని అయోమ‌య ప‌రిస్థితుల్లో ఇరు పార్టీల నేత‌లున్నారు. ఇవాళ విజ‌యవాడ‌లో టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య రాష్ట్ర స్థాయి స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ త‌ల‌పెట్టారు. అప్పుడెప్పుడో ఇరుపార్టీల స‌మ‌న్వ‌య క‌మిటీలు ఏర్పాటైన త‌ర్వాత‌, మొక్కుబ‌డిగా స‌మావేశ‌మ‌య్యారు.

ఇరుపార్టీల మ‌ధ్య ఎలాంటి స‌మావేశాలు జ‌ర‌గ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో, మ‌ళ్లీ అలాంటిది జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌మ‌న్వ‌య స‌మావేశానికి టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, జ‌న‌సేన త‌ర‌పున ఆ పార్టీ పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ హాజ‌రు కానున్నారు. వీరితో పాటు ఇరుపార్టీల క‌మిటీ స‌భ్యులు పాల్గొంటారు.

ఈ స‌మావేశంలో ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎక్క‌డైనా స‌మ‌స్య‌లుంటే చ‌ర్చించ‌నున్నారు. ఉమ్మ‌డి మ్యానిఫెస్టోపై కూడా చ‌ర్చిస్తామ‌ని చెబుతున్నారు. అనుకోవ‌డం వ‌ర‌కూ బాగానే వుంది. కానీ  అస‌లు విష‌యాన్ని విస్మ‌రించ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ముందుగా సీట్ల సంఖ్య‌, అలాగే అభ్య‌ర్థుల‌పై స్పష్ట‌త వ‌స్తే… రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

అప్పుడు ఎక్క‌డైనా లుక‌లుక‌లుంటే స‌ర్దుబాటు చేయ‌డానికి స‌మ‌న్వ‌య స‌మావేశం దోహ‌దం చేస్తుంది. టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల దృష్టంతా సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే వుంది. వాటిపై క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత భంగ‌ప‌డ్డ నేత‌ల రియాక్ష‌న్ ఎలా వుంటుందో అనే ఆందోళ‌న ఇరుపార్టీల్లో వుంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల కేటాయింపుపై అవ‌గాహ‌న‌కు రాకుండా ఇలాంటి స‌మ‌న్వ‌య స‌మావేశాలు ఎన్ని జ‌రిపినా ప్ర‌యోజ‌నం ఏంట‌ని ఇరు పార్టీల నేత‌ల బుర్ర‌ల‌కు త‌ట్ట‌లేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

పొత్తులో ప్ర‌ధానంగా తేల్చుకోవాల్సిన వాటిని ప‌క్క‌న పెట్టి, ఉత్తుత్తి స‌మావేశాలెందుక‌నే జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు నిల‌దీస్తున్నారు. స‌మ‌న్వ‌య స‌మావేశాల పేరుతో ఏదో జ‌రుగుతోంద‌న్న భ్ర‌మ‌లు క‌ల్పించ‌డం వ‌ల్ల‌… రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం వుండ‌ద‌ని అంటున్నారు.