
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా బుధవారం రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సగానికి సగం మంది కూడా ఎన్నికల్లో పాల్గొనకపోవడం గమనార్హం. తిరుపతి నగరంలోని చిన్నబజారువీధి 229, సత్యనారాయణపురం 233 పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగడంతో జిల్లా ఎన్నికల అధికారి రీపోలింగ్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే.
పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. చిన్నబజారు వీధి పోలింగ్ కేంద్రం 229లో 49.56%, సత్యనారాయణపురం 233లో 44.06% ఓటింగ్ నమోదైంది. రెండు పోలింగ్ కేంద్రాల్లో కలిపి 46.81% నమోదు కావడం గమనార్హం. కనీసం ఈ మాత్రమైన ఓటింగ్ నమోదు కావడం విశేషమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా వుండగా తూర్పు రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాల్లో వైసీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య గట్టి ఫైట్ జరిగింది. బరిలో టీడీపీ నిలిచినప్పటికీ పెద్దగా పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు.
వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి మధ్య పోటీ నడిచింది. వీళ్లిద్దరిలో గెలుపు ఎవరిని వరించనుందోనన్న ఉత్కంఠ నెలకుంది.