Advertisement

Advertisement


Home > Politics - Andhra

వార్ వన్ సైడ్ కాదు.. టీడీపీకి సూసైడ్

వార్ వన్ సైడ్ కాదు.. టీడీపీకి సూసైడ్

తెలుగుదేశం పార్టీకి అదిరిపోయే రేంజిలో పంచ్ పడింది. లోకేష్ పాదయాత్ర తో వైసీపీని వణుకు అని చెప్పుకుంటూ తరిస్తున్న తమ్ముళ్ళకు గుక్క తిప్పుకోనీయని రేంజిలో వైసీపీ నుంచి మాటల తూటాలు పేలాయి. ఈ మధ్యనే వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి తనదైన శైలిలో పంచులు పేల్చారు.

తెలుగుదేశం మహిళా ప్రెసిడెంట్ వంగలపూడి అనిత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సహా తెలుగుదేశం నాయకులు అందరికీ ఒక్క మాటతోనే జవాబు చెప్పేశారు. లోకేష్ పాదయాత్రతో ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుందని తమ్ముళ్ళు అంటున్న మాటలకు వరుడు కళ్యాణి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే వార్ వన్ సైడ్ కాదు తెలుగుదేశానికి అది సూసైడ్ అని. లోకేష్ పాదయాత్ర తెలుగుదేశానికి పాడె కట్టే యాత్ర అంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం మింగుడుపడనివే.

లోకేష్ పాదయాత్రకు యువ గళం అని పేరు. అయితే అది జనాల పాలిట గరళం అని వరుడు కళ్యాణి చెప్పడం ద్వారా టోటల్ గా గాలి తీసేశారు. అంతటితో ఆమె ఆగలేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని సామెతను గుర్తు చేశారు. జగన్ పాదయాత్రకూ లోకేష్ పాదయాత్రలు సాపత్యమా అని వెటకారం ఆడారు.

లోకేష్ ది పాత ముఖమే. అదే పెట్టుకుని జనాల్లోకి రావాలన్నారు. వంచనకు మారు పేరు అయిన చంద్రబాబు తనయుడిగా లోకేష్ యువతకు ఏమి చెబుతారు అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చి అన్ని హామీలను బుట్టదాఖలు చేసిన దాని మీద లోకేష్ పాదయాత్రలో నోరు విప్పగలరా అంటూ ఆమె నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక లక్షన్నర మంది యువతకు సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ దే అని గుర్తు చేశారు.

పోలీసు ఉద్యోగాలు ఆరున్నర వేలు ఇచ్చారని, 55 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత జగన్ దే అని ఆమె స్పష్టం చేశారు. సంక్షేమ సారధిగా విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్ ముందు తెలుగుదేశం ఎన్ని రకాల విన్యాసాలు చేసినా తేలిపోక తప్పదని వరుడు కళ్యాణి హెచ్చరించారు. లోకేష్ పాదయాత్ర పేరిట గత కొన్ని రోజులుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలసి చేస్తున్న భజనకు వైసీపీ మహిళా నేత గట్టి రిటార్ట్ ఇవ్వడం ద్వారా డిఫెన్స్ లో పడేశారు అంటున్నారు. దీనికి తెలుగు మహిళా నేతలు, నాయకులు ఏమంటారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?