చినబాబు మాయ హామీలలో ఇది మరొకటి!

అరచేతిలో వైకుంఠం చూపించే మాటలు మాట్లాడడంలో.. తెలుగుదేశం పార్టీ చిన్న బాబు నారా లోకేష్ తండ్రిని మించి పోతున్నారు. తండ్రి కంప్యూటర్ తెరల మీద మాయా రాజధానిని చూపించి వంచించాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు…

అరచేతిలో వైకుంఠం చూపించే మాటలు మాట్లాడడంలో.. తెలుగుదేశం పార్టీ చిన్న బాబు నారా లోకేష్ తండ్రిని మించి పోతున్నారు. తండ్రి కంప్యూటర్ తెరల మీద మాయా రాజధానిని చూపించి వంచించాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు చినబాబు వంతు వచ్చింది. కనీసం కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయాజాలం లాంటి అవసరం కూడా లేకుండా.. మాటల ద్వారా మాత్రమే ప్రజలను బురిడీ కొట్టించడానికి చినబాబు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్మఖులను చేయడం లక్ష్యం అన్నట్టుగా చంద్రబాబు నారా లోకేష్ శంఖారావం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి అందరికీ తెలుసు. టెక్కలిలో ప్రారంభించిన ఈ ప్రచార సభలో అనేక అలవిమాలిన హామీలను లోకేష్ ప్రజల మీదికి సంధించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను  ఏపీ ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసి తామే లాభసాటి మార్గంలో నడుపుతామని అట్టహాసంగా ప్రకటించడం అలాంటి హామీలలో ఒకటి.

విశాఖ ఉక్కు విషయంలో ఉద్యోగుల, ప్రజల ఆశలు ఏమిటి అనే విషయంలో తన అజ్ఞానాన్ని లోకేష్ ఈ రూపంలో బయట పెట్టుకున్నారు. అవగాహన రాహిత్యాన్ని చాటుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కాదు.

ఈ సంగతి లోకేష్ కు తెలియక కాదు. కానీ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంతో పోరాడే ధైర్యం లేక, ఇలాంటి మాయ మాటలు చెబుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. పొత్తుల కోసం మోడీ ఎదుట చంద్రబాబు సాగిల పడుతుండగా, ఒకవేళ గెలిచినా సరే ప్రైవేటీకరణ ను అడ్డుకోలేని తమ చేతకాని తనానికి ముసుగుగా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందనే వాదన వినిపిస్తున్నారు. 

ప్రభుత్వం కొనడం అనేది చిన్న సంగతి కాదు. ప్రజలను ఈ మాటతో బురిడీ కొట్టించి, గెలిచిన తర్వాత నిధుల లేమి అంటూ జగన్ సర్కారు మీద నెపం నెట్టివేసే కుట్ర అలోచన ఇది. విశాఖ ఉక్కు విషయంలో లోకేష్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎప్పటిలోగా రాష్ర్ట ప్రభుత్వం విశాఖ ఉక్కును కొంటుందో డెడ్ లైన్ చెప్పాలి. వేరే మడత పేచీలు పెట్టకుండా కొంటాం అని చెప్పగలగాలి. అలా చేయని పక్షంలో లోకేష్ మాటలను ప్రజలు నమ్మరు.