బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై నారా లోకేశ్ బాంబు పేల్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్య బ్రాహ్మణికి రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు. కానీ బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడాన్ని లోకేశ్ ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. బ్రాహ్మణి రాకను మొగ్గదశలోనే తుంచి వేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. బ్రాహ్మణి రాకతో రాజకీయాల్లో తనను పట్టించుకోరనే భయం లోకేశ్‌ను వెంటాడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. 23 రోజులుగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. జైలు నుంచి బాబు ఎప్పుడు బయటికొస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. మరోవైపు పలు కేసుల్లో లోకేశ్‌ను నిందితుడిగా చేర్చడాన్ని చూస్తున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారంటూ లోకేశ్‌ను 14వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో నాల్గో తేదీన లోకేశ్ విచారణ ఎదుర్కోనున్నారు. ఏదో ఒక కేసులో లోకేశ్ అరెస్ట్ కావడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
తండ్రీతనయులిద్దరూ జైలుపాలైతే… టీడీపీని నడిపేందుకు బ్రాహ్మణి తెరపైకి వస్తారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. ఒకవైపు “నేనున్నా, పార్టీని నడిపిస్తా” అని నందమూరి బాలకృష్ణ గట్టిగా అరుస్తూ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బ్రాహ్మణినే సరైన లీడర్ అంటూ మానసికంగా టీడీపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రాహ్మణికి రాజకీయాలంటే ఆసక్తి లేదని ఈ సమయంలో లోకేశ్ చెప్పడం చర్చనీయాంశమైంది.
బ్రాహ్మణి యాక్టీవ్ అయితే తాను తేలిపోతాననే భయంతోనే లోకేశ్ అలా అన్నారనే చర్చకు తెరలేచింది. బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శబ్దం చేయడం లాంటి కార్యక్రమాల రూపకర్త బ్రాహ్మణీనే అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకొస్తే, తనకు ప్రత్యామ్నాయ నాయకుడవుతాడనే భయంతో పక్కన పెట్టినట్టుగా, భార్య అయిన బ్రాహ్మణిని కూడా అదే రకంగా చేస్తారా? అనే విమర్శ లోకేశ్‌పై మొదలైంది. అందుకే తన తల్లితో బస్సు యాత్ర చేయించడానికి లోకేశ్ సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. కలుషిత రాజకీయాల్లో తన భార్యను ప్రోత్సహించడం ఇష్టం లేకే లోకేశ్ ఢిల్లీలో ఆ రకంగా మాట్లాడారని చెబుతున్నారు.