కోమటిరెడ్డి.. రాజీపడిపోవడమే జీవితమా?

కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఉన్న కొద్ది మంది కీలక నాయకుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకరు. ఆయన పలుమార్లు పార్టీని వీడిపోవడానికి ఊగిసలాడిన నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.  Advertisement తమ్ముడు రాజగోపాల్ రెడ్డి…

కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఉన్న కొద్ది మంది కీలక నాయకుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకరు. ఆయన పలుమార్లు పార్టీని వీడిపోవడానికి ఊగిసలాడిన నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 

తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లిన తర్వాత.. ఆయన విజయం కోసం పాటుపడిన వెంకటరెడ్డి, తాను కూడా కమలతీర్థం పుచ్చుకుంటారనే పుకార్లు వచ్చాయి. కానీ పువ్వు గుర్తుపై తమ్ముడికి పరాభవం తర్వాత.. వచ్చిన స్పష్టతతో ఆయన కాంగ్రెసులోనే మిగిలిపోయారు. ఆయన పార్టీలో పలుమార్లు రాజీపడుతూ వస్తున్నారు.

గతంలో పీసీసీ సారథ్యాన్ని కోమటిరెడ్డి చాలా బలంగా కోరుకున్నారు. కానీ, వర్కవుట్ కాలేదు. పీసీసీ చీఫ్ ని చేస్తే.. పార్టీ ఖర్చులు మొత్తం సొంతంగా పెట్టుకుంటానని కూడా ఆఫర్ ఇచ్చారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.పదవి రేవంత్ రెడ్డికి దక్కడం పట్ల అలకపూనారు. అసమ్మతి నాయకుడిగా ముద్ర పడ్డారు. అయితే ఈ అన్ని విషయాల్లోనూ ఆయన అనివార్యంగా రాజీపడాల్సి వచ్చింది. మెత్తబడి పార్టీ మాట మేరకే నడుచుకునే వాతావరణం ఏర్పడింది.

చూడబోతే.. రాజీపడడం అనేది కోమటిరెడ్డికి బాగా అలవాటు అయిపోయినట్లుగా కనిపిస్తోంది. తన నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో భారాస నుంచి ఫిరాయించి వచ్చిన వేముల వీరేశం కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఆయన గతంలో పలుమార్లు రంకెలు వేశారు. 

తన ఇష్టంతో నిమిత్తం లేకుండా నకిరేకల్ టికెట్ ఇవ్వరని, ఇస్తే ఊరుకునేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వీరేశానికి ఇవ్వనివ్వనని, తన అనుచరుడికే ఇప్నిస్తానని .. ఇలా పలురకాలుగా ఆయన నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు మాట ఇచ్చారు. అయితే ఈ విషయంలో కూడా ఆయన రాజీ పడాల్సి వచ్చింది.

తాజాగా నకిరేకల్ టికెట్ ఆశిస్తూ.. భారాసనుంచి కాంగ్రెసులోకి వచ్చిన వేముల వీరేశం వెళ్లి కోమటిరెడ్డిని కలవడం.. ఆయన ఆలింగనం చేసుకుని అభినందించడం.. వేముల వీరేశం గెలుపునకు తాను దగ్గరుండి అతని నియోజకవర్గంలోని ప్రతి ఊరిలోనూ తిరిగి పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇవ్వడం గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మక రాజకీయాలలో రాజీపడడం అనేది కోమటిరెడ్డికి బాగానే అలవాటు అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.