ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతగా గతిలేనితనంలో కొట్టుమిట్టాడుతున్నదో తాజా పరిణామాలుస్పష్టం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఒక్కశాతం ఓటు బ్యాంకు కూడా లేదు. మాటలు చెప్పే నాయకులు మాత్రం పుష్కలంగా ఉన్నారు. సెలబ్రిటీ హోదాలను సంతరించుకున్న నాయకులు కూడా ఉన్నారు. అయితే.. ఆ పార్టీ పవన్ కల్యాణ్ ఎంత పెడసరపు ధోరణులతో వ్యవహరిస్తున్నా, జనసేనతో బంధం విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోవడానికి ఆ పార్టీకి ఉన్న గతిలేనితనమే కారణమని భావించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని, జగన్ ప్రభుత్వాన్ని పతనం చేస్తానని పవన్ కల్యాణ్ చాలా కాలంనుంచి చెబుతున్నారు. ఇందుకు కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి బిజెపిని కూడా ఒప్పిస్తానని ఆయన ఇన్నాళ్లుగా చెబుతున్నారు.
అయితే, చంద్రబాబునాయుడు అరెస్టు తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన తెలుగుదేశంతో పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించేశారు. తెలుగుదేశంతో సమన్వయం కోసం తమ పార్టీ తరఫున నాదెండ్ల సారథ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే.. ప్రతి సభకు తెలుగుదేశం వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. తెలుగుదేశం సమన్వయంతో తమ కార్యకర్తలు పనిచేయాలని, ఎక్కడా ఎలాంటి అసంతృప్తులకు అవకాశం ఇవ్వవద్దని కూడా అంటున్నారు.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. నాలుగేళ్లుగా ఎన్డీయేలో భాగస్వామిగా, వారితో పొత్తులు పెట్టుకుని ఆయన ఊరేగారు గానీ.. ‘మోడీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్’ అని చాటుకోవడానికి తప్ప ఆ పొత్తు బంధం ఎందుకూ ఉపయోగపడలేదు. ఇప్పుడు తెలుగుదేశం విషయంలో వ్యవహరిస్తున్నట్టుగా, బిజెపితో కలిసి పనిచేయడానికి ఆయన ఎన్నడూ ప్రణాళిక రచించింది కూడా లేదు.
తన హవా కోసమే బిజెపి మిత్రపక్షం అనే పదాన్ని వాడుకున్నారు. తీరా ఇప్పుడు వారిని పూర్తిగా బయటకు గెంటేశారు. అయితే.. పవన్ ఇంకా ఎన్డీయేలో భాగస్వామే అని చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమ గతిలేనితనాన్ని చాటుకుంటున్నది.
తాజాగా జరిగిన భారతీయ జనతా పార్టీ ఏపీ కోర్ కమిటీ సమావేశంలో కూడా ఇదే చర్చ నడిచింది. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల గురించి తమ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం చెప్పాలని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే పవన్ ఇంకా ఎన్డీయేలో ఉన్నట్టు చెబుతున్నందున సంయమనం పాటించాలని కొందరు అనడం గమనార్హం. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట. ఇది కూడా.. అచ్చంగా ఏపీలో బిజెపి గతిలేనితనానికి నిదర్శనం అని ప్రజలు భావిస్తున్నారు.