Advertisement

Advertisement


Home > Politics - Andhra

పోటీ చేయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జాడ‌లేని జ‌న‌సేన‌!

పోటీ చేయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల్లో జాడ‌లేని జ‌న‌సేన‌!

తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఈ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన జ‌న‌సేన పార్టీ అతి ప‌రిమిత సీట్ల‌కు పోటీ చేస్తూ అబాసుపాల‌వుతోంది.  ఎప్పుడైతే జ‌న‌సేన కేవ‌లం 24 సీట్ల‌కు పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారో అప్పుడే జ‌న‌సేన అత్యంత బ‌ల‌హీన‌ప‌డింది. కాపు ఓటు బ్యాంకు, ప‌వన్ కల్యాణ్ అభిమాన‌వ‌ర్గం .. ఇవ‌న్నీ జ‌న‌సేన వెంట ఉన్నాయ‌నుకున్న ద‌శలో జ‌న‌సేన స్థాయిని ప‌వ‌న్ క‌ల్యాణే కిందికి దించారు. కేవ‌లం 24 సీట్ల‌లో పోటీకి ఒప్పుకుని న‌వ్వుల పాల‌య్యారు. మ‌రి ఆ సీట్ల‌లో పోటీ విష‌యంలో అయినా క‌ట్టుబ‌డ్డారా అంటే అంత సీన్ కూడా లేదు! 24 కాస్తా 21 అయ్యాయి. ఆ 21లో తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వారు, చంద్ర‌బాబు పంపిన వారు, రాజ‌కీయంగా తెర‌మ‌రుగు అయిన వారికి రాత్రికి రాత్రి కండువాలు వేసి వాళ్లే అభ్య‌ర్థులు అని ప్ర‌క‌టించారు! ఇది జ‌న‌సేన రాజ‌కీయాన్ని మరింత ప్ర‌హ‌స‌నంగా మార్చింది.

జ‌న‌సేన‌కు క‌నీసం 60 నుంచి 70 సీట్ల‌లో పోటీకి తెలుగుదేశం అవ‌కాశం ఇస్తే కాపు ఓట్ల బ‌దిలీ జ‌రుగుతుంద‌ని కాపు పెద్ద‌లు బాహాటంగానే చెప్పారు. అది వాస్త‌వం కూడా! అయితే ప‌వ‌న్ కు అలాంటి రాజ‌కీయ స్ట్రాట‌జీలు ఏమీ లేవు. కేవ‌లం జ‌గ‌న్ అంటే న‌చ్చ‌దు, జ‌గ‌న్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అది త‌న వ‌ల్ల‌నే అని చెప్పుకుని తృప్తి పొందాలని ఉంది త‌ప్ప‌.. కాపుల‌ను రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగేలా చేయాల‌నో, లేదా జ‌న‌సేన‌ను ఒక రాజ‌కీయ పార్టీగా నిల‌బెట్టాల‌నే ఉద్దేశాలేవీ ప‌వన్ కు లేవనే క్లారిటీ అంద‌రికీ ఉంది.

ఇప్పుడు అందుకు ఫ‌లితాలు గ‌ట్టిగా క‌నిపిస్తున్నాయి. జ‌న‌సేన పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌డం, అక్క‌డ అభ్య‌ర్థుల విష‌యంలో జ‌రుగుతున్న ర‌చ్చ‌ల సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. రాష్ట్రంలో 150 సీట్లకు పైగా జ‌న‌సేన పోటీలో లేదు! వీటిల్లో గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. కొద్దోగొప్పో ఓట్ల‌ను తెచ్చుకున్న సీట్లున్నాయి, జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రో ఒక‌రు పని చేస్తూ.. ఈ ఎన్నిక‌ల్లో పోటీ అవ‌కాశం కోసం ఆశించిన వారున్న నియోజ‌క‌వ‌ర్గాలూ ఉన్నాయి! అయితే.. ఎప్పుడైతే ప‌వన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నారో.. అప్పుడే ఇలాంటి చోట్ల జ‌న‌సేన ఊసు లో లేకుండా పోవ‌డం మొద‌లైంది. 

తెలుగుదేశంతో పొత్తుతో ఎలాగూ అక్క‌డ జ‌న‌సేన నుంచి అవ‌కాశం ల‌భించ‌ద‌నే క్లారిటీతో చాలా మంది జారుకున్నారు. అభ్య‌ర్థుల విష‌యంలో క్లారిటీ వ‌చ్చాకా స‌రేస‌రి! టీడీపీ పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన కోసం మొన్న‌టి వ‌ర‌కూ ప‌ని చేసిన వాళ్లంతా ఇప్పుడు వేరే దారులు చూసుకుంటున్నారు. మామూలుగానే జ‌న‌సేన‌కు పార్టీ నిర్మాణం ఏమీ లేదు. ఎక్క‌డైనా ఇన్ చార్జిలు, గ‌తంలో పోటీ చేసిన వారు ఉంటే.. వారి కేంద్రంగానే అక్క‌డ జ‌న‌సేన ఉనికి ఆధార‌ప‌డి ఉండేది. ఇప్పుడు వాళ్లు కూడా కాడి ప‌డేస్తున్నారు! పోటీలోనే లేని పార్టీ త‌ర‌ఫున తాము చేసేదేముంద‌న్న‌ట్టుగా వారి స్పంద‌న ఉంది.

రాష్ట్రంలో ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఎక్క‌డైనా జ‌న‌సేన ఇన్ చార్జిలో, ఆ పార్టీ అభిమానులో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థితో క‌లిసి ప్ర‌చారం చేస్తున్న దాఖ‌లాలు లేవు! కొన్ని చోట్ల జ‌న‌సేన కండువాల‌తో కుర్ర‌కారు ఎక్క‌డైనా వ‌చ్చినా, జై జ‌న‌సేన అని నినదించినా టీడీపీ నేత‌లు, క్యాడ‌ర్ వారిని నోరుమూయ‌మంటున్నారు! తాడిపత్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ముందు ఎవ‌రో ఇలానే అరిస్తే ఆ వీరాభిమానిపై అంతా ఒక్క‌సారిగా ప‌డిపోయారు. జేసీతో స‌హా అంతా ఆ జ‌న‌సేన అభిమానిని అదిలించారు! అక్క‌డే కాదు.. చాలా చోట్ల జ‌న‌సైనికుల ప‌రిస్థితి ఇదే! జ‌న‌సేన వాళ్లే వెళ్లి వీరాభిమానంతో టీడీపీ అభ్య‌ర్థుల వెంట తిరుగుతామ‌న్నా.. వారు వారిని ఖాత‌రు చేసే ప‌రిస్థితి లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?