జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ అవ‌స‌రం లేదు

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అపాయింట్‌మెంట్ చాలా క‌ష్ట‌మ‌య్యేది. సీఎం బాధ్య‌త‌ల్లో ఉన్నంత కాలం ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ఎన్నెన్ని అగ‌చాట్లో. బ‌హుశా అధికార మాయ కావ‌చ్చు. సొంత పార్టీ నాయ‌కుల్ని క‌లిసే తీరిక…

ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అపాయింట్‌మెంట్ చాలా క‌ష్ట‌మ‌య్యేది. సీఎం బాధ్య‌త‌ల్లో ఉన్నంత కాలం ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ఎన్నెన్ని అగ‌చాట్లో. బ‌హుశా అధికార మాయ కావ‌చ్చు. సొంత పార్టీ నాయ‌కుల్ని క‌లిసే తీరిక జ‌గ‌న్‌కు లేక‌పోయింది. ఇక వైసీపీ కార్య‌క‌ర్త‌లు, సామాన్య ప్ర‌జ‌ల గురించి ఆలోచించాల్సిన ప‌నేలేదు. పులివెందుల‌కు జ‌గ‌న్ వెళ్లినా, త‌న వాళ్ల‌ను ఆయ‌న క‌ల‌వ‌లేక‌పోయారు.

దీంతో వైసీపీ కేడ‌ర్‌, ఆయ‌న్ను అభిమానించే ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి. త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని జ‌గ‌న్‌పై ఆగ్ర‌హం. ఇలాంటి నాయ‌కుడు మ‌న‌కెందుకు? అనే నిర‌స‌న‌. అన్నీ క‌లిసి ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర ప‌రాజ‌యం. క‌ర్ణుడి చావుకు ఎన్ని కార‌ణాలో, అంత‌కు మించి వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి స‌మాధానాలు చెప్పొచ్చు.

ఏమైతేనేం … ఓట‌మి జ‌గ‌న్‌కు కావాల్సిన ఫ్రీ స‌మ‌యాన్ని ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ నేత‌లకు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి ఎలాంటి అపాయింట్‌మెంట్ అక్క‌ర్లేదు. తాడేప‌ల్లిలో జ‌గ‌న్‌ను ఆయ‌న నివాసంలో చాలా మంది వైసీపీ నేత‌లు క‌లిశారు. అపాయింట్‌మెంట్ అని కాకుండా, కేవ‌లం తాము వ‌స్తున్నామ‌ని స‌మాచారం ఇచ్చి, వాళ్లంతా వెళ్లారు. ఇవాళ కూడా వివిధ జిల్లాల నుంచి ఓడిపోయిన నాయ‌కులు, వారి అనుచ‌రులు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి వెళ్లారు. గ‌తంలో మాదిరిగా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూడాల్సిన ప‌నిలేకుండా పోయింది. ఈ ర‌కంగా అయినా జ‌గ‌న్‌తో మ‌న‌సులో మాట పంచుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల్ని జ‌గ‌న్‌కు నేరుగా వివ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో క‌నెక్టివిటీ ఎందుకు క‌ట్ అయ్యిందో జ‌గ‌న్‌కు వివ‌రిస్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు ల‌క్ష‌లాది కోట్లు ఖ‌ర్చు చేసిన‌ప్ప‌టికీ, ఎందుకు ఓట‌మిపాలు కావాల్సి వ‌చ్చిందో నాయ‌కులు వివ‌రిస్తున్నారు. వీట‌న్నింటిని జ‌గ‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని, మ‌ళ్లీ పూర్వ వైభ‌వం కోసం ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తారో చూడాలి.