బీహార్‌కు ప్రత్యేక ఇవ్వాలంటూ బీజేపీని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కావడంలో జేడీయూ, టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా బీజేపీకి సంఖ్యా బలం లేదు. దీంతో ఎన్డీఏలోని జేడీయూ, టీడీపీకి ప్రాధాన్యం పెరిగింది.
ఈ నేపథ్యంలో బీహార్‌కు ప్రత్యేక ఇవ్వాలంటూ గత ఏడాది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ ప్రాధాన్యం పెరగడంతో ఇదే అవకాశంగా ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది.
జేడీయూ సీనియర్ నేత, మంత్రి విజయ్‌కుమార్ చౌదరీ మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, అలాగే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విభజన తర్వాత తమ రాష్ట్రానికి ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కడం ప్రత్యేక హోదా లేకుండా సాధ్యం కాదని ఆయన అన్నారు.
జేడీయూ రీతిలో టీడీపీ వ్యవహరిస్తుందా? అనే చర్చకు తెరలేచింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ మాదిరిగానే తాను కూడా కీలకమని గుర్తెరిగి, ప్రత్యేక హోదా కోసం టీడీపీ డిమాండ్ చేస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మరీ ముఖ్యంగా ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో రాజ్యసభ వేదికగా బీజేపీ వాగ్దానం చేసింది. అలాగే 2014 ఎన్నికల ప్రచార సందర్భంలోనూ తిరుపతిలో నాడు ప్రధాని అభ్యర్థిగా మోదీ కూడా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని పక్కన పడేశారు.
ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ మాత్రం సజీవంగా వుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకం అయిన నేపథ్యంలో, విభజన హామీల్ని సాధించుకోడానికి ఇదే సరైన సమయమని, బీజేపీపై ఒత్తిడి తేవాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. బీహార్‌లో జేడీయూ నేతలు మీడియా ముందుకొచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్స్ చేస్తున్నారు. జేడీయూ నేతల్ని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ నేతలు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు గళం విప్పుతారో చూడాలి.