జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగ‌డానికేనా?

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీలో మొట్ట‌మొద‌టి మార్పు. తాడేప‌ల్లిలో ఒక అద్దె భ‌వ‌నంలో నిర్వ‌హిస్తున్న వైసీపీ కార్యాల‌యాన్ని మూసివేశారు. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం నుంచే వైసీపీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించారు. ఇంత‌కాలంలో ముఖ్య‌మంత్రి…

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వైసీపీలో మొట్ట‌మొద‌టి మార్పు. తాడేప‌ల్లిలో ఒక అద్దె భ‌వ‌నంలో నిర్వ‌హిస్తున్న వైసీపీ కార్యాల‌యాన్ని మూసివేశారు. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యం నుంచే వైసీపీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి నిర్ణ‌యించారు. ఇంత‌కాలంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంగా కొన‌సాగుతున్న భ‌వనాన్ని, వైసీపీ కార్యాల‌యంగా మార‌నుంది. జ‌గ‌న్ నివాస ఆవ‌ర‌ణ‌లోనే వైసీపీ కార్యాల‌యం ఉండ‌డం.. ప్ర‌స్తుత త‌రుణంలో మంచి ప‌రిణామం.

ఇక‌పై వైసీపీ కార్య‌క‌లాపాల‌ను వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అప్పుడే పార్టీ కోలుకుంటుంద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. బ‌హుశా పార్టీ కార్య‌క‌లాపాల‌ను రోజువారీ ప‌ర్య‌వేక్షించ‌డానికి తానే రంగంలోకి దిగాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పార్టీని జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పెద్ద‌లు గాలికి వ‌దిలేశారు. ఒక్క‌రోజు కూడా పార్టీ కేడ‌ర్‌తో స‌మావేశం నిర్వ‌హించిన దాఖ‌లాలు లేవు. అందుకే క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల గురించి వాస్త‌వాల‌ను చెప్పేవారు క‌రువ‌య్యారు. పైగా వైసీపీని అధికారంలోకి తెచ్చుకోడానికి ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న ఆగ్ర‌హం, ఆవేద‌న కేడ‌ర్‌లో గూడు క‌ట్టుకున్న‌ది. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం త‌మ‌కెందుకులే అన్న‌ట్టు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయిన త‌ర్వాత‌, పార్టీ ప‌నులు మినహా జ‌గ‌న్‌కు ప‌నేం లేదు. ఇప్ప‌టికైనా ఆయ‌న పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం వుంది. పార్టీ కార్యాల‌యాన్ని త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఏర్పాటు చేసుకుంటుండంతో జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారిస్తార‌నే కేడ‌ర్ ఆశ ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుందో చూడాలి.