రేపు అనేదొకటి వుందని వాస్తవాన్ని విస్మరించిన వారే అతి చేస్తుంటారు. ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. ఈ క్షణం పని జరిగితే చాలు, తమ కక్ష తీరితే అంతకంటే ఆనందం ఏముందని విరవీగుతుంటారు. ఇలా రెచ్చిపోయిన వ్యక్తుల్లో ఏ స్థాయి వారున్నా… చివరికి భారీ మూల్యం చెల్లించుకుంటారు. కాలం అనేది అత్యంత శక్తిమంతమైంది. అది అందరికీ గుణపాఠం చెబుతూ వుంటుంది.
కాకపోతే నేర్చుకోడానికి మనుషులకే అహం అడ్డం వస్తూ వుంటుంది. కానీ కాలం తన పని తాను చేసుకుపోతుంటుంది. తాజాగా ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల్ని చూస్తే… ఔరా, ఎంత అహంకారం? రేపొకటి వస్తుందని ఎందుకు మరిచిపోతున్నారనే ప్రశ్న ఎదురవుతోంది.
వైసీపీని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పును అందరూ గౌరవించాల్సిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి ఇంకా నాలుగైదు రోజుల సమయం వుంది. మరోవైపు అధికారంలోకి రావడమే ఆలస్యం, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై మారణాయుధాలతో స్వైర విహారం చేస్తూ, వైసీపీ నాయకులు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. ఊళ్లు వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలిస్తున్నారు. ఈ చర్యల్ని టీడీపీ పెద్దలు మౌనంతో ప్రోత్సహిస్తున్నారు.
రోజు గడిచే కొద్ది అధికారం ఆయుష్షు తగ్గిపోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వుంటే, దుశ్చర్యలకు పాల్పడేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఏపీలో తమకు తిరుగే లేదన్నట్టుగా టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారనే భావన అందరిలో కలుగుతోంది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా జగన్ మాత్రమే ఎన్నికల్లో ఓడిపోలేదని తెలుసుకుంటే మంచిదన్న హితవు చెప్పేవాళ్లు లేకపోలేదు. అయితే అధికారం వచ్చిందన్న అహంకారం… టీడీపీని ఇష్టానురీతిలో నడిపిస్తోందనే అనుమానం కలుగుతోంది.
చంద్రబాబునాయుడు, లోకేశ్ తీరు కూడా కక్ష తీర్చుకోవాలన్నట్టుగా వుంది. అయితే గతానికి భిన్నంగా పాలన సాగిస్తేనే ప్రజాదరణ ఉంటుందనే సూక్ష్మ విషయాన్ని విస్మరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కోరి ప్రజా వ్యతిరేకత తెచ్చుకుంటామంటే … అడ్డుకునే వారెవరు? గతానుభవాలను గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన నాయకులే, అధికారం అనేది ప్రత్యర్థులపై పగ తీర్చుకోడానికి జనం ఇచ్చారనేలా ప్రవర్తిస్తే, చేయగలిగేదేమీ లేదు. ఐదేళ్ల కోసం ఎదురు చూడడం తప్ప!