రాజుల పాలన మళ్ళీ మొదలు

రాజులు రాజ్యాలు ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. విజయనగరం రాజులే అందుకు ఉదాహరణ. ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే విజయనగరం జిల్లాలో రాజుల నవతరం ముందుకు వచ్చింది. కొత్త వారసత్వం పురుడు…

రాజులు రాజ్యాలు ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. విజయనగరం రాజులే అందుకు ఉదాహరణ. ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే విజయనగరం జిల్లాలో రాజుల నవతరం ముందుకు వచ్చింది. కొత్త వారసత్వం పురుడు పోసుకుంది.

పీవీజీ రాజు నుంచి విజయనగరాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తూ వస్తున్న పూసపాటి వారి వంశీకుల మూడోతరం ఇపుడు రాజకీయంగా ఎదిగింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిది గజపతిరాజుని విజయనగరం ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఆమె తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

తండ్రికి సిసలైన వారసురాలిగా నిలిచారు. అలాగే బొబ్బిలి సంస్థాధీశులకు సంబంధించి కొత్త తరం ప్రతినిధిగా బేబీ నాయన ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తన అన్న మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు నుంచి ఈ వారసత్వ పగ్గాలు అందుకున్నారు. బొబ్బిలిలో మూడు దశాబ్దాల తరువాత టీడీపీకి గెలుపు రుచి ఏమిటో ఆయన చూపించారు.

అలా ఈ ఇద్దరు వారసులూ రాజుల పాలనను మళ్ళీ తెచ్చారు. విజయనగరం జిల్లాలో రాజులకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రతిపత్తిని కాపాడారు. ఈ ఇద్దరికీ ఇపుడు మంత్రి పదవుల మీద ఆశలు ఉన్నారు. రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన వీరికి చంద్రబాబు తన క్యాబినెట్ లో తీసుకుని తగిన ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. రానున్న రోజులలో వీరు మంత్రులుగా జనం ముందుకు వస్తారని వారి అభిమానులూ అనుచరులు ఆశిస్తున్నారు.