జ‌న‌సేన సీట్ల‌ను చూసి.. ఆయ‌న‌కు నోట మాట రాలేదా?

రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసే సీట్ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. జ‌న‌సేన శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యేలా టీడీపీ సీట్ల‌ను కేటాయించింది. కేవ‌లం 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.…

రానున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేసే సీట్ల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. జ‌న‌సేన శ్రేణులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యేలా టీడీపీ సీట్ల‌ను కేటాయించింది. కేవ‌లం 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు ద‌క్కే సీట్ల‌పై ఇంత‌కాలం ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎవ‌రు చెప్పినా జ‌న‌సేన‌కు మ‌హా అయితే 25 నుంచి 28 సీట్లు లోపే ఇస్తార‌న్నారు. ఇంకా గొప్ప‌గా అంటే 30 సీట్ల‌కు మించి ఒక్క‌టి కూడా ఇవ్వ‌రనే ప్ర‌చారం విస్తృతంగా సాగింది.

ఇలాంటి ప్ర‌చారాలు తెర మీద‌కి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా, ప‌వ‌న్‌ను హెచ్చ‌రించ‌డానికి కాపు కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ జోగ‌య్య సోష‌ల్ మీడియా తెరపైకి వ‌చ్చేవారు. 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు ద‌క్క‌క‌పోతే, అలాగే సీఎం ప‌ద‌విలో షేర్ ఉండ‌క‌పోతే… జ‌న‌సేన ఓట్లు టీడీపీకి బ‌దిలీ కావంటూ అనేక సంద‌ర్భాల్లో బ‌హిరంగ లేఖ‌ల ద్వారా హెచ్చ‌రించారు. హ‌రిరామ జోగ‌య్య చెప్పిందే నిజ‌మ‌ని కాపు నేత‌లు కూడా వ‌త్తాసు ప‌లికారు.

ఎట్ట‌కేల‌కు జ‌న‌సేన సీట్ల‌కు ఇచ్చే సీట్ల‌పై చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇచ్చారు. జ‌న‌సేన సీట్ల లెక్క 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాల‌ని తేలిపోయింది. అయితే ఈ లెక్క‌పై ఇంత వ‌ర‌కూ హ‌రిరామ జోగ‌య్య స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. హ‌రిరామ జోగ‌య్య రియాక్ష‌న్ ఏంటో తెలుసుకోవాల‌ని జ‌న‌సేనతో పాటు మిగిలిన పార్టీల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎంత‌కూ ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డంతో… జ‌న‌సేన సీట్ల‌ను చూసి, హ‌రిరామ జోగ‌య్య షాక్‌కు గుర‌య్యార‌ని నెటిజ‌న్లు పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

షాక్‌లో హ‌రిరామ‌జోగ‌య్య మాట్లాడ లేక‌పోతున్నార‌ని, కోలుకున్న త‌ర్వాత స్పందిస్తారంటూ సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. జ‌న‌సేన సీట్ల‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వ్యంగ్య పోస్టులు ప్ర‌త్య‌క్షం కావ‌డం గ‌మ‌నార్హం.