ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారాలు!
అనుభవాలకు మించిన గురువులు లేరంటారు. విద్యార్థి దశలో గురువులు పాఠాలు చెప్పగా, నేర్చుకుని పరీక్షలు రాయడం సహజం. కానీ జీవితమనే విద్యాలయంలో పరీక్షలు ఎదుర్కొని, పాఠాలు నేర్చుకుంటామనే అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసైనికులుగా కొన్ని విషయాలు ఏపీ సమాజంతో పంచుకోవాలని భావిస్తున్నాం. ఇంత కాలం మేమెంతో అభిమానిస్తున్న మా నాయకుడు పవన్‌కల్యాణ్ నుంచి రాష్ట్రానికి పొంచి వున్న ప్రమాదం గురించి హెచ్చరించదలుచుకున్నాం.
మంచీ చెడు అనే విచక్షణ లేకుండా, గుడ్డిగా నమ్మితే మోసపోతారని మన పూర్వీకులు చెప్పారు. కానీ పెద్దల మాటల్ని పట్టించుకోకుండా అజ్ఞానంతో పవన్‌కల్యాణ్ వెంట రాజకీయంగా నడిచినందుకు ఇవాళ తీవ్ర మనోవేధనకు గురి కావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోకకల్యాణం కోసం టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నట్టు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. నిజమే అని నమ్మాం.
గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని పవన్ పలుమార్లు బహిరంగంగా చెప్పారు. 20, 25 సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని పవన్ ఖండించారు. ఆ ముష్టి సీట్లు మనకెందుకు? అలాంటి ప్రచారాల్ని నమ్మొద్దని ఆయన చెప్పారు. మూడొంతుల సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. దీంతో సంబరపడ్డాం. 60 అసెంబ్లీ, 8 లోక్‌సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని లెక్కలేసుకున్నాం. బలహీనంగా ఉన్న టీడీపీకి మన కలయిక ప్రాణం పోసిందని పవన్ బహిరంగంగానే ప్రకటించారు. నిజమే అని మేము నమ్మాం. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం.. జనసేనకు అంత సీన్ లేదని, 20 సీట్లు ఇవ్వడమే గొప్ప, చంద్రబాబు దయతలచి ఓ ఐదు సీట్లు ఎక్కువ ఇవ్వొచ్చని నాలుగైదు రోజుల క్రితం పేర్కొంది.
ఇలా రాసినందుకు, చెప్పినందుకు ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాం. కానీ అదే నిజమైంది. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ కలిసి ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితా మాకు షాక్ ఇచ్చింది. జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఇస్తున్నట్టు చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారు. వింటున్నది నిజమా? కాదా? అని మమ్మల్ని మేము గిచ్చుకుని పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఔను, మేము పీడకల కనడం లేదని అర్థం కావడానికి చాలా సమయం పట్టింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధంతా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలకే తప్ప, అధి నాయకుడికి కాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా వుంది. ఔను, టీడీపీ విధిల్చిన ముష్టి 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుని, ఇకపై టీడీపీ పల్లకీ మోయడానికి సిద్ధపడడం కంటే… మాకు శిక్ష మరొకటి లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాం.
మాకు ముష్టి వేసిన టీడీపీపై ఏ మాత్రం కోపం రావడం లేదు. ముష్టి కోసం దేహీ అంటూ ఆ పార్టీతో అంటకాగుతున్న పవన్‌కల్యాణ్‌ను చూస్తుంటే.. మొదటిసారిగా అసహ్యం వేస్తోందని చెప్పడానికి చింతిస్తున్నాం. పోరాటంలో చేగువేరా స్ఫూర్తి అని చెప్పే నాయకుడేనా… ఈ ముష్టి సీట్ల కోసం తనను అభిమానించే వారందరితో ఊరూరా సిగ్గు లేకుండా టీడీపీ నేతల పల్లకీలు మోయడానికి అవగాహన కుదుర్చుకున్నదన్న ఆగ్రహం పెల్లుబికుతోంది.
జాతీయ జెండాకున్నంత పొగరు వుందనే స్ఫూర్తిదాయక మాటలు.. కేవలం బహిరంగ సభలకే పరిమితమయ్యాయని తెలుసుకోడానికి ఇంత కాలం పట్టింది. నిజంగా జన సైనికుల ఆత్మగౌరవం గురించి ఆలోచించే నాయకుడే అయితే… కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లకే టీడీపీతో ఒప్పందం చేసుకోవడం ఏంటి? జనసేన అంటే మరీ ఇంత ఛీప్‌గా అంచనా వేస్తున్నారా? మా పార్టీని మరెవరో అవమానించడం లేదు. మా అధ్యక్షుడు పవన్‌కల్యాణే… టీడీపీ వేసిన ముష్టి తీసుకుని , ఇదీ మా తాహతు అని చెప్పి కించపరిచారు.
ఈ సీట్లు తీసుకోవడం కంటే, 2014లో మాదిరిగా టీడీపీ పల్లకీ మోయాలని కోరి వుంటే… ఆ పని సంతోషంగా చేసేవాళ్లు. కనీసం సరాసరి జిల్లాకు ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా తీసుకోకపోతే… ఇదేమైనా రాజకీయ పార్టీనా? లేక టీడీపీ పల్లకీ మోయడానికి పెట్టిన కంపెనీనా? నమ్మి పదేళ్లుగా వెంట నడుస్తున్నందుకు పవన్‌కల్యాణ్ తగినట్టుగానే శిక్ష విధించారు. ఒక అసమర్థుడి వెంట నడిచినందుకు అవమానం, మనోవేదన కాకుండా మరేం మిగుల్తాయి.
ప్రత్యేకంగా పవన్‌ను విపరీతంగా అభిమానిస్తున్న కాపు, బలిజ, వాటి అనుబంధ కులస్తుల బాధ వర్ణనాతీతం. శత్రువులకు కూడా ఆ బాధ, కన్నీళ్లు రాకూడదని కోరుకుంటున్నాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలుగు సమాజంలో బలమైన సామాజిక వర్గమైన కాపులకు రాజ్యాధికారం దక్కలేదనే ఆవేదన వుంది. తెలుగు సమాజంలో ఓట్ల పరంగా బీసీల తర్వాత ప్రభావవంతమైన సామాజిక వర్గం వారిదే. మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఫెయిల్ అయిన తర్వాత, పవన్ రాక వారిలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే కాపులకు రాజ్యాధికారంపై ఆశలు చిగురించాయి.
పవన్‌ను సీఎంగా చూసుకోవాలన్న ఆకాంక్ష కాపుల్లో బలంగా వుండింది. అయితే పవన్‌కు సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం అయ్యేంత సీన్ కూడా లేదని ఇటీవల లోకేశ్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. దీంతో కాపుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లకు అవగాహన కుదుర్చుకోవడంతో పవన్‌ను అమితంగా ప్రేమించే కాపులకు గుండె ఆగినంత పనైంది.
ఎవరైతే పవన్‌ను అమితంగా ప్రేమించి, రాజకీయంగా వెంట నడిచారో, వాళ్లందరినీ నిలువునా ముంచారు. తన వెంట నడిచే వాళ్లందరినీ టీడీపీ జెండా మోసే కూలీలుగా మార్చారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు ఇస్తారనే ప్రచారంపై తనను ప్రశ్నించిన వాళ్లపై జగన్ కోవర్టులుగా ముద్ర వేశారు. పొత్తును ప్రశ్నించే వాళ్లంతా తనకు అవసరం లేదని బహిరంగంగా చెప్పారు. అయినప్పటికీ సిగ్గూఎగ్గూ లేకుండా పవన్ వెంటే నడిచిన పాపానికి ఇవాళ తీవ్ర మానసిక వేదనకు గురి కావాల్సి వస్తోంది.
నిజానికి పవన్‌ను కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. కులం, సినీ అభిమానం పేరుతో ఆయన వెంట రాజకీయంగా నడిచిన వాళ్లదే తప్పు. ఇప్పుడు చెంపలు వాయించుకోవాల్సిన పరిస్థితి. గత పదేళ్లలో పవన్‌కల్యాణ్ చిత్తశుద్ధితో చేసిన పని ఏదైనా వుందంటే.. చంద్రబాబు పల్లకీ మోయడమే. అది వేర్వేరు రూపాల్లో వుండింది. మేమే అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయి గుర్తించలేకపోయాం.
2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడం ఎందుకు? అదేదో నేరుగానే చంద్రబాబు పార్టీలో చేరొచ్చు కదా? అని ఆనాడే ప్రశ్నించే వుంటే… ఇవాళ ఈ దుస్థితి వచ్చి వుండేది. 2019 ఎన్నికల నాటికి వచ్చే సరికి చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చడానికి.. ఏవేవో కబుర్లు చెప్పి వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌లపై పవన్ విమర్శల్ని నిజమే అని నమ్మినోళ్లంతా వెర్రోళ్లని పవన్ మనసులో నవ్వుతూ అనుకున్నారని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.
2024 ఎన్నికలు వచ్చే సరికి జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటూ… ముష్టినెత్తికోడానికి కూడా సిద్ధపడ్డ పవన్‌ను చూస్తున్నాం. అరరె… వెండితెరపై ఇంతకాలం పోషించని క్యారెక్టర్లను రాజకీయ తెరపై చేయడం చూసి మాకే ఆశ్చర్యం కలుగుతోంది. నీలోని ఎన్నెన్ని ముఖాలున్నాయో… తెలుసుకోలేక పోవడం అభిమానులుగా రాజకీయ, సినీ అభిమానులుగా మాదే తప్పు. కానీ నీ గురించి 2014లో అరుణ్‌సాగర్ అనే సీనియర్ జర్నలిస్టు హెచ్చరిస్తూ… ఒకటో నంబర్ హెచ్చరిక పేరుతో ఆర్టికల్ రాశారు. ఏం చేద్దాం, నిజాలు చెబితే ఎవరికీ ఒక పట్టాన ఎక్కవు కదా. ఆ మహానుభావుడు చనిపోయి ఏ లోకాన వున్నారో తెలియదు కానీ, ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడిప్పుడు మా వెంట పడుతోంది.
పవన్ గురించి అరుణ్ సాగర్ చేసిన హెచ్చరిక ఏంటో వ్యాసంలోని ప్రధాన అంశాలు…
“డియర్ చే(చేగువేరా). మమ్మల్ని క్షమించు. ఓ అజ్ఞాని చేసిన అపచారానికి, దాన్ని ఆనాడే నిలదీయకుండా లైటు తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు. నువ్వు నలుగురికీ కొత్తగా పరిచయమతావనీ నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షతో సహించాం. ఇప్పుడిక తాటతీస్తాం”
“ఎంత మోసగాడివి గురూ. మోసగాడు సినిమాలో మీ అన్నయ్య నటించాడు. నువ్వేమో చే గువేరా బొమ్మలు పెట్టుకున్నావ్, శివసాగర్ కవిత్వం చదివావ్, తిలక్‌ని కోట్ చేశావ్, కొమురం పులి సినిమా టైటిల్ పెట్టుకున్నావ్. నీ గురించి ఊహించుకున్నదొకటి నువ్వు చేసిందొకటి. అంటే ఇంత వరకూ నువ్విచ్చింది ఓ బిల్డప్ అన్నట్టు. పెద్ద బిల్డప్. బకరా బనాలియా హం కో. బద్దలైపోయింది గురూ. నిజరూపం బట్టబయలైపోయింది గురూ. ఇదొక స్కెచ్. ఆ స్కెచ్‌లో నువ్వొక గీత. రెండు సినిమాలు ఫ్లాపయితే చెరిగిపోయే గీత. నీకు కూడా తెలిసిరావాలిలే. నీ సీను తరిగిన రోజున నీకేసి గల్లీలీడరు కూడా చూడడని తెలిసే – నీ రోజు నీకుంది అన్నయ్యా. లేదా మీ అన్నయ్య చూస్తే అర్థమవుద్ది”
“ఆనాడే నీకేం తెలుసని అడిగుంటే, నీ జ్ఞానమేంటో ప్రశ్నించి ఉంటే ఇప్పుడిలా మోసపోయే వాళ్లం కాదు”
నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఏంటో అనుకున్నాం. ఇప్పుడు పవన్ నిజస్వరూపం పొత్తు ద్వారా బయటపడింది. అరుణ్‌సాగర్ హెచ్చరించినట్టు పవన్ వైపు గల్లీ లీడర్ కూడా చూడని రోజు రానే వచ్చింది. వాళ్ల అన్నయ్యకు పట్టిన గతే అతనికి మరోసారి పట్టించడానికి కాలం ఎదురు చూస్తోంది.
అభిమానంతో రాజకీయంగా వెంట నడిచిన వాళ్లను టీడీపీకి అమ్మకానికి పెడితే, ఎప్పట్లా తలూపుతూ టీడీపీ జెండా మోయడానికి సిద్ధం లేము. ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిన్న జన సైనికులం. మా అభిమానం, ప్రేమను అజ్ఞానంగా భావించి, ఇష్టమొచ్చినట్టు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఊరుకోడానికి సిద్ధంగా లేము. రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే పదేళ్లుగా జనసేనపై అభిమానంపై పెంచుకుని, పవన్ బాధితులుగా మిగలడమే ఎక్కడో తెలియని ఆవేదన.
టీడీపీ విసిరిన ముష్టిని తీసుకుని ఊరేగడానికి పవన్ సిద్ధంగా ఉండొచ్చు. ఆత్మాభిమానం ఉన్న జనసైనికులెవరూ ఈ పొత్తును స్వాగతించడానికి సిద్ధంగా లేరు. నమ్మి వెంట నడిచిన వారిని వెన్నుపోటు పొడిచిన పవన్‌కల్యాణ్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ…
-ఇట్లు
బాధాతప్త హృదయాలతో జన సైనికులు