Advertisement

Advertisement


Home > Politics - Andhra

గోరంట్ల‌కు క‌రువైన వైసీపీ మ‌ద్ద‌తు!

గోరంట్ల‌కు క‌రువైన వైసీపీ మ‌ద్ద‌తు!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు అధికార పార్టీ నుంచి మ‌ద్ద‌తు క‌రువైంది. ఓ మ‌హిళ‌తో మాధ‌వ్ న‌గ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడారంటూ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఎల్లో మీడియా, టీడీపీ సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ గోరంట్ల మాధ‌వ్‌తో పాటు అధికార పార్టీని బద్నాం చేసేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా గోరంట్ల మాధ‌వ్ రాస‌లీల‌పై పౌర స‌మాజం ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తోంద‌ని వైసీపీ మిన‌హా ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల అభిప్రాయాల్ని తెర‌పైకి తెస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం చేష్ట‌లుడిగి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. ఏం చేయాలో దిక్కుతోచ‌ని అయోమ‌యంలో వైసీపీ వుంది. ఒక‌వేళ‌ స‌మ‌ర్థిస్తే ఏమ‌వుతుందో అనే భ‌యం వైసీపీ మీడియాని వెంటాడుతోంది.

మ‌రోవైపు ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని కొంద‌రు మ‌హిళా నేత‌లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు.  న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ మహిళలను శారీరకంగా హింసిస్తున్న నీచుడికి తగిన శిక్ష పడాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇక వంగ‌ల‌పూడి అనిత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు... ఇలా అనేక మందితో ఎల్లో మీడియా మాట్లాడిస్తూ వైసీపీని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను మాధ‌వ్ ఒక్క‌డే మీడియా ముందుకొచ్చి ఖండించ‌డం గ‌మ‌నార్హం. మాధ‌వ్‌కు మ‌ద్ద‌తుగా ఏ ఒక్క ఎంపీ కూడా ముందుకు రాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. న‌కిలీ వీడియో అని మాధ‌వ్ చెబుతున్న‌ప్ప‌టికీ, సొంత పార్టీ నాయ‌కులు. అనుకూల మీడియా విశ్వ‌సించ‌లేద‌నే అనుమానం క‌లుగుతోంది. మాధ‌వ్ చెబుతున్న‌ది నిజ‌మే అయితే వైసీపీ ఎందుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తింది.

కేవ‌లం మాధ‌వ్ ఖండ‌న వార్త‌కు మాత్ర‌మే జ‌గ‌న్ సొంత మీడియా ప్రాధాన్యం ఇస్తోంది. అంత‌కు మించి మాధ‌వ్‌కు మ‌ద్ద‌తుగా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేయ‌డం లేదా ప‌లువురి అభిప్రాయాల్ని ప్ర‌జ‌ల ముందు పెట్టేందుకు వైసీపీ మీడియా ముందుకు రాలేదు. దీన్నిబ‌ట్టి మాధ‌వ్ తీరుపై వైసీపీ కూడా ఎక్క‌డో అనుమానిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ వివాదం నుంచి మాధ‌వ్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?