రంగులు మార్చడంలో జనసేనాని పవన్‌కల్యాణ్ కంటే తానే నయం అని ఊసరవెల్లి అనుకుంటూ వుంటోంది. రాజకీయాల్లో స్థిరత్వం, మాటపై నిలబడే నిలబడని లేని నాయకుడిగా పవన్ చాలా త్వరగానే గుర్తింపు పొందారు. ఒక్కో వారాహి యాత్రలో ఒక్కో రకంగా మాట మార్చడం ఆయనకే చెల్లింది.
ప్రస్తుతం ఆయన నాల్గో విడత వారాహి యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాట్లాడుతూ వైసీపీ మహమ్మారికి జనసేన, టీడీపీ సంకేర్ణమే టీకా అని అన్నారు. ఈ రెండు పార్టీల ప్రభుత్వమే రానున్న ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతో నేను కలిసి వెళ్తే ఓట్లు వస్తాయి.. అయితే ఎంతమందిమి అసెంబ్లీకి వెళ్లగలం? అని ఆయన ప్రశ్నించారు.
ఒక సారి గతానికి వెళితే… ఎన్డీఏ మిత్ర పక్షాల కూటమి సమావేశానికి పవన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన స్వరంలో మార్పు కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇదే పవన్‌కల్యాణ్ అంతకు ముందు జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీజేపీతో మిత్రపక్షంగా వుంటూనే, ఆ పార్టీతో సంబంధం లేకుండా తన ఒక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పదేపదే నమ్మబలికేవారు. అలాగే టీడీపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకపోయినా, ఆ పార్టీని కలుపుకుని ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని చెప్పడాన్ని చూశాం.
నాల్గో విడత వారాహి యాత్ర వచ్చేసరికి…బీజేపీ మాయమైంది. కేవలం టీడీపీ, జనసేన మాత్రమే మిగిలాయి. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఓట్లు వస్తాయో తప్ప, గెలవలేమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ బలమేంటో తెలిసి కూడా ఆ పార్టీతో ఎంతో ముందుగానే పొత్తు ఎందుకు పెట్టుకున్నారో పవన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆ పార్టీతో విడిపోతున్నామనే సమాచారాన్ని జనానికి ఇవ్వాల్సిన అవసరం లేదా? రాజకీయాల్లో రంగులు మార్చడంలో పవన్ ఊసరవెల్లిని మించిపోయారనేందుకు ఈ నిదర్శాలు చాలవా? రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్ని నాటకాలు వేస్తారో చూడాలి.