సినిమా ప్రమోషన్ కోసం నిర్వాహకులు ఏం చేస్తారో అందరికీ తెలుసు. సినిమా రిలీజ్‌కు ముందు, ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తుంటారు. సినిమా కథ, చిత్రీకరణ, నటన, కామెడీ.. ఓహ్, గతంలో ఎప్పుడూ మనం ఏ సినిమాలో చూసి వుండమనే రీతిలో మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటుంటారు. ఎలాగైనా ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించి, సొమ్ము చేసుకోవాలనే వ్యూహంతో మూవీ నిర్వాహకులు ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.
అలాంటి వ్యూహాన్నే జనసేనాని పవన్‌కల్యాణ్ రచించినట్టున్నారు. పెడనలో వారాహి యాత్రపై ఏపీ ప్రజానీకం అటెన్షన్ కోసం టెన్షన్‌ను క్రియేట్ చేయడానికి యత్నించడాన్ని చూడొచ్చు. పెడన నుంచి వైసీపీ తరపున జోగి రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రి కూడా. దూకుడు స్వభావం ఎక్కువ. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని తలపడే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అందుకే జోగి రమేశ్ నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నట్టు సమాచారం.
పవన్‌కల్యాణ్ తన యాత్రకు ప్రచారం కోసం పెడన నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటో జనసేన నేతలు ఆఫ్ ది రికార్డుగా కీలక విషయాన్ని చెబుతున్నారు.
గతంలో జోగి రమేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఇంటిపై దాడికి పార్టీ సైన్యాన్ని తీసుకెళ్లారు. ఆ ఘటనను మనసులో పెట్టుకున్న పవన్‌కల్యాణ్, తాజాగా పెడనలో వారాహియాత్రపై దాడులంటూ పథక రచన చేశారని జనసేన నాయకులు చెప్పడం గమనార్హం. జోగి రమేశ్ రెచ్చగొట్టే స్వభావాన్ని సాకుగా తీసుకుని, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా పవన్ వివాదాస్పద కామెంట్స్ చేశారని సమాచారం. అయితే పవన్‌కల్యాణ్ కామెంట్స్‌ను వైసీపీ ప్రభుత్వం వెంటనే చిత్తు చేసింది.
పవన్‌కు నోటీసు ఇవ్వడం ద్వారా ఆయన నోరు మూయించింది. నోరు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. పెడనలో ప్రశాంత వాతావరణం వుందని, వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బందులుండవని పోలీస్‌శాఖ ప్రకటన చేసింది. వారాహి యాత్రకు తన వివాదాస్పద ప్రకటనతో బందోబస్తును పవన్ పెంచుకోగలిగారు. వారాహి యాత్ర ప్రమోషన్ కోసం ఇదంతా సినిమా ఎత్తుగడ అంటూ వైసీపీ నేతలు వెటకరిస్తున్నారు.