సింపుల్ లాజిక్ మిస్ అవుతున్న పవన్!

ఒకరి సభలో అల్లర్లు జరిగాయంటే, ఆ సభను భగ్నం చేసేలాగా రాళ్లు రువ్వడం జరిగిందంటే.. లేదా సభలో పాల్గొన్న వారిని కత్తులతో పొడవడం జరిగిందంటే.. ఆటోమేటిగ్గా.. అందరి అనుమానం వారి ప్రత్యర్థుల మీదికే మళ్లుతుంది.…

ఒకరి సభలో అల్లర్లు జరిగాయంటే, ఆ సభను భగ్నం చేసేలాగా రాళ్లు రువ్వడం జరిగిందంటే.. లేదా సభలో పాల్గొన్న వారిని కత్తులతో పొడవడం జరిగిందంటే.. ఆటోమేటిగ్గా.. అందరి అనుమానం వారి ప్రత్యర్థుల మీదికే మళ్లుతుంది. ఇది ఒకటో క్లాసు పిల్లవాడిని అడిగినా చెప్పే సింపుల్ లాజిక్. అయితే ఇంటర్మీడియట్ కూడా చదువుకున్న పవన్ కల్యాణ్ కు మాత్రం ఈ లాజిక్ మీద సరైన అవగాహన ఉన్నట్టు లేదు. 

అందుకే.. తన సభలను భగ్నం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలను, క్రిమినల్స్ ను దించుతున్నదని ఆయన పదేపదే చెప్పుకుంటున్నారు. వైసీపీ మనుషులను దించడం కాదు కదా.. పవన్ సభలో ఏ చిన్న అల్లరి జరిగినా అది వైసీపీ మీదకు వెళ్తుందనే అవగాహన వారికి ఉంటుందనే విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు.

ఇలాంటి సమస్య ఎందుకు వస్తున్నదంటే.. పవన్ కల్యాణ్ కు తన గురించి తనకు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తొలినుంచి ఆయనకు ఈ సమస్య ఉంది. తనను తాను చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటారు. తన బలాన్ని అపరిమితమైనదిగా ఊహించుకుంటారు. తాను దైవాంశ సంభూతుడినని అనుకుంటారో ఏమో మనకు తెలియదు. ఇలా తన గురించి తాను అతిగా ఊహించుకుని ఒకసారి భంగపడ్డారు. 

2014లో చంద్రబాబు పల్లకీ మోసి, 2019లో ఒంటరిగా పోటీచేయడం ద్వారా.. తాను ఉన్నపళంగా ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన ఊహించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ దాకా వెళ్లి, మాయావతిని మహామహిమాన్వితురాలిగా విపరీతంగా కీర్తించి, అనేకమెట్లు దిగజారిన పవన్ కల్యాణ్.. బీఎస్పీతో పొత్తు వలన ఎస్సీ ఓటు బ్యాంకు అంతా తనకు కలిసి వస్తుందని… కాపు మరియు ఎస్సీ ఓట్లతో ఢంకా బజాయించి గెలుస్తానని అనుకున్నారు. కానీ.. కనీసం తాను కూడా గెలవలేకపోయారు.

ఆ తర్వాత.. పార్టీపెట్టినంత మాత్రాన ఈజీగా సీఎం అయిపోరు, ప్రజలు ఆశీర్వదించాలి.. అని డైలాగుల శైలి మార్చిన పవన్ కల్యాణ్.. తన అతి ఊహల్ని మాత్రం విడిచిపెట్టలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. పవన్ కల్యాణ్ సభల్లో రాళ్లు వేయించడమూ, ఆ సభకు వచ్చిన వారిని కత్తులతో పొడిచి హత్య చేయించడమూ తప్ప మరొక లక్ష్యం, జీవితాశయం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. 

పవన్ కల్యాణ్ చెప్పినా చెప్పకపోయినా అల్లర్లు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. పవన్ కల్యాణ్ ఏదో సినిమా డైలాగుల్లో బెదిరిస్తున్నట్టుగా జగన్ పేరు, డీజీపీ పేరు పదేపదే చెప్పి బెదిరించాల్సిన అవసరం కూడా లేదు. 

సభకు హాజరైన జనాన్ని ప్రదర్శించుకోవడానికి పార్టీ తీయించే వీడియోలు, డ్రోన్ వీడియోలు అన్నీ పూర్తిగా పోలీసులకు, ఎడిట్ చేయకుండా, అప్పగిస్తే గనుక.. ఆయా సభల్లో ఏదైనా అల్లర్లు జరిగితే అసలు ద్రోహులను పట్టుకోవడానికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ సంగతి పవన్ గుర్తుంచుకుని బాధ్యతగా వ్యవహరిస్తే చాలునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.