ప్రత్యర్థులపై నోటికొచ్చినట్టు విమర్శలు చేయడం జనసేనాని పవన్‌కల్యాణ్‌కు బాగా తెలిసిన విద్య. ఇలా నిరాధార ఆరోపణలతో జగన్ సర్కార్‌ను గత కొన్నేళ్లుగా పవన్ విమర్శిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబుతో విభేదించినప్పుడు పవన్ ఇదే రీతిలో వ్యవహరించారు. ప్రస్తుతం నాలుగో విడత వారాహి యాత్రను ఆయన కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవాళ సాయంత్రం పెడన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. మచిలీపట్నంలో మంగళవారం పవన్ మాట్లాడుతూ పెడన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లర్లు సృష్టించడానికి ప్లాన్ వేశారని, ఇందుకు 2 వేల నుంచి 3 వేల మంది పులివెందుల రౌడీలను దింపుతారని తనకు సమాచారం వుందని సంచలన ఆరోపణ చేశారు. అల్లర్లు జరిగితే సీఎం, హోం మంత్రి, డీజీపీ తదితర పోలీస్ అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ వివాదాస్పద కామెంట్స్‌ను పోలీస్‌శాఖ సీరియస్‌గా తీసుకుంది. అల్లర్లకు సంబంధించి ఆధారాలుంటే సమర్పించాలని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా జనసేనానికి నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో దాడులు జరుగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియజేయాలని నోటీసులో కోరారు. అయితే పవన్ నుంచి పోలీస్‌శాఖకు ఎలాంటి సమాధానం లేదు.
ఈ నేపథ్యంలో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తగిన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు. బాధ్యతా రాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన అన్నారు. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలని ఎస్పీ హితవు పలికారు. పవన్‌కంటే తమ నిఘా వ్యవస్థ బలంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.