పవన్ చేతగానితనం తేలిపోతోందిగా?

జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా ఒక మెట్టు దిగి తక్కువ సీట్లు తీసుకున్నాం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతవరకు ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బిజెపి కలిసి వస్తుందనే అంశాన్ని కూడా…

జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఒక్కటే లక్ష్యంగా ఒక మెట్టు దిగి తక్కువ సీట్లు తీసుకున్నాం అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంతవరకు ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బిజెపి కలిసి వస్తుందనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సీట్టు తగ్గించుకుంటున్నట్టు చెప్పుకున్నారు.

అందరూ పవన్ కల్యాణ్ 60 దగ్గర ప్రారంభించి.. కనీసం 30 సీట్లకు ఒప్పుకుంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. ఆయన కేవలం 24 సీట్లకే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగించింది. బిజెపి కలిసి రావడం గురించి ఇప్పటికి ప్రకటన రాలేదు గనుక.. ఈ దామాషానే  లెక్క వేసుకోవాలి. 175 లో జనసేన 24 అనగా తెలుగుదేశం 151 స్థానాల్లో పోటీచేయబోతున్నదని భావించాలి. కానీ ఈ గణాంకాలను ప్రకటించిన అభ్యర్థుల పేర్లను గమనించినప్పుడు.. ఒక కోణంలో.. పవన్ కల్యాణ్ చేతగానితనం ఏమిటో చాలా స్పష్టంగా తేలిపోతున్నది.

తెలుగుదేశం పార్టీ తమకు దక్కే 151 సీట్లలో 94 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను తొలివిడతలోనే ప్రకటించింది. అంటే ఇంచుమించుగా 62 శాతం సీట్లకు తమ అభ్యర్థులను తొలివిడతలోనే ప్రకటించేసింది. అదే జనసేన విషయానికి వస్తే.. 24 స్థానాలకు గాను కేవలం 5 చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అంటే 20 శాతం సీట్లు మాత్రమే.

ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీచేయాలని, అధికారంలోకి రావాలని కొన్నేళ్లుగా కసరత్తులు చేస్తూనే ఉన్న పవన్ కల్యాణ్ కనీసం.. అభ్యర్థులను నిర్ణయించుకోలేని దుస్థితిలో ఉన్నారనడానికి, ఆ పార్టీ చేతగానితనానికి ఇది నిదర్శనం.

ఇలాంటి వైఫల్యాలు గమనిస్తే చాలానే ఉన్నాయి. జనసేనకు దక్కిన 24లో కనీసం పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో కూడా  ప్రకటించలేదు. తన సంగతి కూడా పవన్ ఇంకా డిసైడ్ కానేలేదా? ఇంకా తనకోసం నియోజకవవర్గం దేవులాటలోనే ఉన్నారా?

చంద్రబాబునాయుడు సంగతి మేలు కదా. ఆయన తొలిజాబితాలోనే తన సొంత సీటును కూడా ప్రకటించేశారు. పవన్ కల్యాణ్ కేవలం నాదెండ్ల మనోహర్ సీటును మాత్రమే ప్రకటించారు. తన పార్టీకి దక్కే సీట్లలో 80 శాతం స్థానాల్లో అభ్యర్థులు ఎవరో ఇంకా నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్న పార్టీ ఎలాంటి ముందడుగు  వేస్తుంది.. అనేది చర్చనీయాంశంగా ఉంది.

తెలంగాణ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ తనకు దక్కిన 8 సీట్లను బేరం పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు అమ్ముకున్నారనే పేరు వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అదే రిపీట్ అవబోతోందా? తనకు 24 సీట్లు దక్కినట్టుగా ఇప్పుడు ప్రచారంలో పెట్టి.. నెమ్మదిగా ఇక మిగిలిన 19 సీట్లకు అభ్యర్థులను వెతకడం, బేరాలాడడం ప్రారంభిస్తారా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి, పవన్ ఏం చేస్తారో చూడాలి.