జనసేనాని పవన్‌కల్యాణ్ అజ్ఞానం అపారం. బహుశా రెండు లక్షల పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన అజ్ఞానం కాబోలు. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత ఆయనలోని మూర్ఖుడు మరింతగా చెలరేగిపోతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో ఎంతో ముందుగానే పవన్ పొత్తు వుంటుందని ప్రకటించడం వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే ఈ ఆరు నెలల్లో జనసేనాని పవన్‌తో పాటు ఆయన శ్రేణులు పిచ్చి పనులు తప్పక చేస్తారనే అభిప్రాయం బలపడుతోంది.
జగన్‌పై పవన్ విమర్శలు మోతాదు మించిపోతున్నాయి. చివరికి సొంత వాళ్లలో కూడా అసహనం, కోపం కలిగేంతగా జగన్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వారాహి నాల్గో విడత యాత్రను బుధవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని తెలియజేస్తున్నాయనే చర్చకు తెరలేచింది.
తన సభలో అల్లర్లు సృష్టించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల నుంచి మూడు వేల మంది వరకూ రౌడీలు దింపుతున్నట్టు సమాచారం వుందని ఆరోపించారు. ఆ రౌడీలంతా రాళ్లు, కత్తులు తదితర మారణాయుధాలతో వస్తారని, వాళ్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని పవన్ టీడీపీ, జనసేన శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం, హోంమంత్రి, డీజీపీ, డీఐజీలు, ఎస్పీలను పవన్ హెచ్చరించారు.
ఏపీ ప్రజానీకం చైతన్యంపై పవన్‌కు చిన్న చూపు ఉన్నట్టుంది. తన రాజకీయ పంథాపై జనానికి అవగాహన లేదని ఆయన అనుకంటున్నట్టుగా వుంది. అందుకే పవన్ పదేపదే పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారనే అనుమానం ప్రజానీకంలో ఉంది. పవన్ సభలో అల్లర్లు సృష్టించాల్సిన అవసరం జగన్‌కు ఎందుకుంటుందనే స్పృహ పవన్‌కు లేకపోయినా, జనానికి బాగా వుంది. సీఎం జగన్‌పై బురద చల్లితే, తన పార్టీ శ్రేణులు అప్రమత్తం అవుతాయని ఆయన ఆశిస్తున్నట్టుగా వుంది.
బడి పిల్లలు 50 వేల మందికి పైగా చనిపోయారని, వలంటీర్లు అమ్మాయిల రవాణాకు పాల్పడ్డారని, హైదరాబాద్‌లో ఏపీ ప్రజానీకం వ్యక్తిగత సమాచారం ఉందని ఇలా మాట్లాడేవాళ్లను ఏమంటారు? ఎక్కడికి తరలించాలని కోరుకుంటారో పవన్ ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. తన ప్రత్యర్థి ఒక మానసిక రోగి అయితే జగన్‌కు ఆనందమే కదా. పిచ్చోడి ముద్ర వేయడానికి జగన్ పని సులువవుతుంది. జగన్‌కు పని పెట్టకుండా, తనకు తానుగానే ఆ పని చేసుకుంటున్న పవన్ వల్ల రాజకీయ ప్రయోజనాలు ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రమాదం పొంచి వుందో టీడీపీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టుగా వుంది. సీఎం జగన్‌ను తిడుతుంటే, బ్యానర్ హెడ్డింగ్‌లకు ఉపయోగపడుతోందని సంబరపడితే, రానున్న రోజుల్లో ఇదే క్యారెక్ట్ టీడీపీకి ఎంతో నష్టాన్ని చేయకుండా ఉండదని గ్రహించాలి. గతంలో పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో వుండగా, కరెంట్ పోతే, చంద్రబాబు, లోకేశ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించడాన్ని మరిచిపోవద్దు.
పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా, పవన్ చేతిలో రాజకీయం అట్లా తయారైందనే విమర్శ వెల్లువెత్తుతోంది. నాల్గో విడత పాదయాత్రలో మునుపటి జోష్ కనిపించడం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న పవన్‌ను జనం కూడా లైట్ తీసుకుంటున్నారని సమాచారం. పవన్ కామెంట్స్‌లో నిలకడలేనితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ధోరణే ఆయన్ను పలుచన చేస్తోంది.