Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప‌వ‌న్‌ను న‌మ్ముకున్నావ్‌.. శిక్ష అనుభ‌వించ‌య్యా!

ప‌వ‌న్‌ను న‌మ్ముకున్నావ్‌.. శిక్ష అనుభ‌వించ‌య్యా!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను న‌మ్ముకుని బాగుప‌డినోళ్లు చాలా త‌క్కువ‌. కానీ రాజ‌కీయంగా ఆయ‌న్ను న‌మ్ముకుని భ్ర‌ష్టు ప‌ట్టినోళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్నిక‌లు పూర్త‌య్యే స‌రికి ప‌వ‌న్ బాధితులు చాలా మందే రోడ్డు మీదికి వ‌చ్చి ల‌బోదిబోమ‌న‌డానికి సిద్ధంగా ఉన్నారు. ప‌వ‌న్ బాధితుల్లో కొత్త‌గా పోతిన మ‌హేశ్ చేర‌నున్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున చేసిన పోరాటాల గురించి ఏక‌రువు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అలుపెర‌గ‌ని పోరాటాలు చేస్తున్న త‌న‌కు టికెట్ ఇవ్వ‌ర‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. మ‌హేశ్ ఇంకా ఏడ్వ‌లేద‌ని, క‌ళ్ల‌లో నీళ్లు చూద్దామ‌ని కొంద‌రు ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను ఏడ్వ‌న‌ని ఆయ‌న అన్నారు. త‌న‌కు న్యాయం చేస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ప‌వ‌న్‌ను ప‌లుమార్లు క‌లిసినా విజ‌య‌వాడ వెస్ట్ టికెట్‌పై భ‌రోసా ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న అల్ల‌రి చేస్తున్నార‌నేది సుస్ప‌ష్టం. పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ పోతిన మ‌హేశ్‌లాంటి వారికి కూడా టికెట్ ఇప్పించుకోలేక పోయాన‌ని వాపోయారు.

ఇదే విష‌యాన్ని పోతిన మ‌హేశ్‌కు మీడియా ప్ర‌తినిధులు గుర్తు చేస్తూ... ఒక‌వేళ టికెట్ రాక‌పోతే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏంట‌ని ప్ర‌శ్నించారు. పోతిన మ‌హేశ్ సూటిగా స‌మాధానం చెప్ప‌లేదు. ఏం చేసేది చూస్తారు క‌దా అని అన్నారు. ప‌వ‌న్‌ను ప్రేమిస్తాం, అభిమానిస్తాం అంటూ డొంక‌తిరుగుడు స‌మాధానం ఇచ్చారు.  

జ‌న‌సేన పార్టీ కోసం కోట్లాది రూపాయ‌లు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టాన‌ని పోతిన మ‌హేశ్ ఎవ‌రికి చెబుతున్నారో అర్థం కావ‌డం లేదు. ఏదైనా వుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ద్ద తేల్చుకోవాలే త‌ప్ప‌, ఇలా బ‌జారుకెక్కుతూ న‌ష్టం ఎవ‌రిక‌నే ప్ర‌శ్న జ‌న‌సేన నుంచి వ‌స్తోంది. పోతిన మ‌హేశ్ వ్య‌వ‌హార శైలి జ‌న‌సేన‌కు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను న‌మ్ముకుంటే ఏమ‌వుతుందో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌చార్జి సూర్యచంద్ర, త‌ణుకు ఇన్‌చార్జ్ విడివాడ రామ‌చంద్ర‌రావు, రాజ‌మండ్రి రూర‌ల్ ఇన్‌చార్జ్ కందుల దుర్గేష్‌, ముమ్మ‌డివ‌రం జ‌న‌సేన ఇన్‌చార్జ్ పితాని బాల‌కృష్ణ త‌దిత‌రుల‌ను అడిగితే చెబుతార‌ని ప‌లువురు హిత‌వు ప‌లుకుతున్నారు. ప‌వ‌న్‌ను న‌మ్ముకునే వారెవ‌రైనా చివ‌రికి భ్ర‌ష్టు ప‌ట్టాల్సిందే అని, శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?