
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. బాబును భయపెట్టే రాజకీయ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి. చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసులతో మాత్రమే భయపెడుతున్నారు. జైలుకు పంపడంతో ఆ భయం కూడా చంద్రబాబులో పోయి వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసులతో సంబంధం లేకుండా ఓటమి పేరుతో చంద్రబాబును వివిధ మిత్రపక్షాల పార్టీలు భయపెడుతున్నాయి. ఈ భయమే చంద్రబాబును ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోంది. వైఎస్ జగన్ అత్యంత శక్తిమంతుడని, కేవలం టీడీపీతోనే ఆయన్ను ఎదుర్కోవడం సాధ్యం కాదనేది అందరి అభిప్రాయం. ఈ ఒక్క సాకు చూపి చంద్రబాబును చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారం.
చంద్రబాబు అరెస్ట్ కాక ముందు పలువురు చిన్నాచితకా నాయకులు ఆయన్ను కలుసుకునేవారు. ఈ సందర్భంగా తమ ఓట్లు కావాలంటే, ఎన్నికల్లో తమకూ సీట్లు కావాలని బాబు ఎదుట డిమాండ్లు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో జనసేన ఇప్పటికే పొత్తును అధికారికంగా ప్రకటించింది. ఇదే దారిలో వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), జై భీమ్ భారత్ పార్టీ, లోక్‌సత్తా, బీఎస్పీ, అమరావతి బహుజన జేఏసీ తదితర పార్టీలు, సంస్థలు కూడా చంద్రబాబును సీట్లు అడుగుతున్నట్టు సమాచారం.
వీళ్లంతా నిత్యం ఎల్లో మీడియా చానళ్ల డిబేట్లలో కూచుని పే...ద్ద నాయకులన్నట్టు బిల్డప్ ఇస్తుంటారనే విమర్శ వుంది. సీపీఐ, సీపీఎం నాయకులు తమకు కనీసం ఆరు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సూటు, బూటు వేసుకుని న్యాయకోవిధుడనే పిక్చర్ ఇచ్చే ఒకాయన తన పార్టీకి నాలుగు అసెంబ్లీ, ఒక ఎంపీ టికెట్లు ఇవ్వాలని చంద్రబాబుని డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే అమరావతి కోసం బహుజనుల తరపున మాట్లాడుతున్న ఫోజు కొట్టే ఒకాయన తనకు తాడికొండ టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని తెలిసింది.
వీళ్లంతా జగన్‌ను పెద్ద బూచిగా చూపుతూ, బాబును భయపెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ తమ ఆకాంక్షలను చంద్రబాబు నెరవేర్చకపోతే, రేపటి నుంచి వీళ్లే ఆయనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారం చేయడానికి వెనుకాడరు. వీళ్లందరికీ చంద్రబాబు టికెట్లు ఇస్తారా? లేక మరో రకంగా సంతృప్తి పరుస్తారా? అనేది కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా