ఆల‌యాల చుట్టూ జ‌గ‌న్ మేన‌మామ ప్ర‌ద‌క్షిణ‌లు!

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రైనా ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని భావించి, వారి అనుగ్ర‌హం కోసం ఒక‌టికి ఐదారుసార్లు తిర‌గ‌డం చూస్తుంటాం.…

వైఎస్సార్ జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రైనా ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని భావించి, వారి అనుగ్ర‌హం కోసం ఒక‌టికి ఐదారుసార్లు తిర‌గ‌డం చూస్తుంటాం. కానీ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి ఏం క‌ష్ట‌మొచ్చిందో తెలియ‌దు. నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి భార్య‌తో క‌లిసి ఆయ‌న దైవానుగ్ర‌హం కోసం గుళ్లూ, గోపురాలు తిర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌ధానంగా క‌మ‌లాపురం టికెట్‌పై ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌కు స్వ‌యాన మేన‌మామ అయిన ర‌విరెడ్డికే టికెట్‌పై భ‌రోసా ఇవ్వ‌ని ప‌రిస్థితి వుందంటే… జ‌గ‌న్ ఎంత క‌ఠినంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. క‌మ‌లాపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాల‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే టికెట్ ద‌క్క‌డం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇదే సీటును ఆయ‌న కుమారుడు న‌రేన్ రామాంజ‌నేయ‌రెడ్డి ఆశిస్తున్నారు.

అయితే పోటీ ఎవ‌ర‌నేది పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చు. క‌మ‌లాపురంలో త‌న మేన‌మామపై అంత పాజిటివ్ లేద‌ని స‌ర్వే నివేదిక‌ల ద్వారా జ‌గ‌న్ తెలుసుకున్నారు. దీంతో ప్ర‌త్యామ్నాయ నాయ‌క‌త్వాన్ని తెర‌పైకి తీసుకొచ్చే త‌లంపులో జ‌గ‌న్ ఉన్న‌ట్టు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి గ్ర‌హించారు. అందుకే టికెట్ ద‌క్క‌ద‌నే భ‌యం ఆయ‌న్ను వెంటాడుతోంది. ప‌దేళ్ల‌కే ఎమ్మెల్యేగా చాప చుట్టేస్తే, ఇక త‌న కుమారుడి భ‌విష్య‌త్ ఏం కావాల‌నేది కూడా ఆయ‌న్ను భ‌య‌పెడుతోంది.

ఈ నేప‌థ్యంలో టికెట్ ద‌క్కాలంటే వ‌చ్చే నెల 10వ తేదీ వ‌ర‌కూ ఆల‌యాలు సంద‌ర్శించి, పూజ‌లు చేయాల‌ని ఎవ‌రో న‌మ్మ‌క‌స్తులైన జ్యోతిష్యులు ర‌విరెడ్డికి చెప్పిన‌ట్టు తెలిసింది. అందుకే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని విడిచి పెట్టి, ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి క‌నీసం వారానికి ఒక‌సారైనా వెళ్లి, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి వుంటే ఈ దుస్థితి వ‌చ్చేది కాదు క‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. మ‌రోవైపు క‌మ‌లాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నర‌సింహారెడ్డి చేరిక‌ల‌పై దృష్టి సారించి, వాటిని వేగ‌వంతం చేశారు. మ‌రి మేన‌మామ‌కు టికెట్‌పై క్లారిటీ ఎప్పుడిస్తారో, ఆయ‌న రంగంలోకి దిగేందుకు శుభ ముహూర్తం ఎప్పుడో అనే చ‌ర్చ క‌మ‌లాపురంలో జ‌రుగుతోంది.