Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆర్కే ప‌రువు...రాజుగారి దేవ‌తా వ‌స్త్రాలు!

ఆర్కే ప‌రువు...రాజుగారి దేవ‌తా వ‌స్త్రాలు!

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే ప‌రువు న‌ష్టం దావా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎవ‌రు ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా కొన్ని వార్త‌ల‌ను రాయాలంటే రాధాకృష్ణ‌లాంటి వారి నాయ‌క‌త్వంలోనే సాధ్యం. ఇందుకు రెండు కార‌ణాలు. ఒక‌టి వేమూరి రాధాకృష్ణ ధైర్యం, రెండు బ‌రితెగింపు. ఈ రెండే ఆయ‌న ఆస్తిపాస్తులు. ఆర్కే ప‌రువు అంశం తెర‌పైకి వ‌చ్చిన నేప‌థ్యంలో ఓ క‌థ గుర్తుకొస్తోంది.

రాజుగారి ఊరేగింపు చూసి ప్రజలు ముగ్ధుల‌వుతున్నారు. ప్ర‌జ‌ల ఆనందానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. రాజుగారు ధ‌రించిన వ‌స్త్రాలను చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వ‌ట‌! రాజుగారి వస్త్రాలను చూడగలిగిన కన్నులే కన్నులట! ఆ వ‌స్త్రాల‌ను చూడాలంటే ఎన్నో తెలివితేట‌లు వుండాల‌ట‌. వ‌స్త్రాలు క‌నిపించ‌లేదంటే తెలివిలేద‌ని అర్థ‌మ‌ట‌! ఇంద్ర‌లోకాధిప‌తి దేవేంద్రుడితో స‌మాన స్థాయి క‌లిగిన‌ రాజుగారి రాజసానికి తగ్గ‌ట్టుగానే దేవతావస్త్రాల్ని అందించిన  నేతగాళ్ళ గురించి ప్ర‌జ‌లు  చెప్పుకుంటున్నారు. రాజుగారి ఒంటిపై వ‌స్త్రాలు లేవంటే వారిని తెలివితక్కువ వాళ్లు అనుకుంటారని ప్ర‌జానీకంలో ఒక ర‌క‌మైన‌ భయం. ఇంతలో ఒక చిన్నపిల్లవాడు దిగంబ‌రంగా ఉన్న రాజుగారిని చూసి... ‘ఛీ రాజుగారు వ‌స్త్రాలు ధ‌రించ‌కుండా తిరుగుతున్నారు’ అని గట్టిగా అరిచాడనే క‌థ‌ను ప్ర‌తి ఒక్క‌రూ బాల్యంలో విని, చ‌దివి వుంటారు.

ఆర్కే విష‌యంలో ప‌రువు రాజుగారి వ‌స్త్రాల్ని త‌ల‌పిస్తోంది. చంద్ర‌బాబుపై గుడ్డి ప్రేమ ఆయ‌న‌లో విచ‌క్ష‌ణ‌తో పాటు జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల్ని చంపేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో సంగ‌తిని కాసేపు ప‌క్కన పెడ‌దాం. నాలుగేళ్ల క్రితం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదే ఆర్కేపై ట్విట‌ర్ వేదిక‌గా ఎందుకని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారో స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

అప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా చంద్ర‌బాబును విభేదించి సొంతంగా వెళుతున్నార‌నే అక్క‌సు. ప‌వ‌న్ నిర్ణ‌యంతో చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా భారీ దెబ్బ త‌గులుతుంద‌నే ఆందోళ‌న‌, నాడు ప‌వ‌న్‌ను ఆర్కే మీడియా టార్గెట్ చేయ‌డానికి కార‌ణ‌మైంది. ప‌వ‌న్ త‌ల్లిని శ్రీ‌రెడ్డి అనే న‌టి తూల‌నాడితే... ఆర్కే మీడియాలో ప‌దేప‌దే ప్ర‌సారం చేయ‌డానికి కార‌ణం ఏంటి? బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డితే స‌రి, లేదంటే ఏమైనా చేస్తామ‌నే బ‌రి తెగింపే ...ఆర్కేపై దూష‌ణ‌ల‌కు కార‌ణ‌మైంద‌ని జ‌ర్న‌లిస్టులు చెబుతున్నారు. ఇత‌రులను మ‌న‌మెంత గౌర‌విస్తామో, అటు వైపు అంతే మ‌ర్యాద పొందుతామ‌ని ఆర్కే ఎందుకు గ్ర‌హించ‌లేక‌పోతున్నార‌నేదే ప్ర‌శ్న‌.

అంతెందుకు రానున్న రోజుల్లో చంద్ర‌బాబుతో పొత్తు కుదుర్చుకోకుండా జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా పోటీ చేస్తే ఇదే రాధాకృష్ణ నిత్యం విషం చిమ్మ‌కుండా ఉంటార‌ని హామీ ఇవ్వ‌గ‌ల‌రా? ఇటీవ‌ల బీజేపీ అమ‌రావ‌తి ప్రాంతంలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తే, ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడైన సోము వీర్రాజును కాద‌ని మిగిలిన నాయ‌కుల‌కు ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ప్రాధాన్యం ఇవ్వ‌డం నిజం కాదా?  జ‌ర్న‌లిజం నైతిక విలువ‌ల‌ను పాటిస్తుంటే రాజ‌కీయ ప‌క్షాల‌కు టార్గెట్ ఎందుకు అవుతారు?

2019 ఎన్నిక‌ల‌కు ముందు ఓ యువ‌కుడితో ల‌క్ష్మిపార్వ‌తి లైంగిక‌ప‌ర‌మైన అంశాల‌కు సంబంధించి చాటింగ్ చేసిందంటూ క్రియేట్ చేసి, దానిపై డిబేట్లు నిర్వ‌హించేంత నీచ‌స్థాయికి చంద్ర‌బాబు కోసం దిగ‌జారిన విష‌యం నిజం కాదా? టీడీపీ కంటే ముందు రాజ‌కీయంగా చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థుల‌పై మీడియాని అడ్డుపెట్టుకుని దిగ‌డం వాస్త‌వం కాదా? ఎప్ప‌టి సంగ‌తో ఎందుకు కానీ, ఇవాళ మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ గంజి చిరంజీవిపై గుంటూరు టాబ్లాయిడ్‌లో "అంద‌ల‌మెక్కించిన పార్టీపై అభాండాలు" అంటూ వ్య‌తిరేక క‌థ‌నం రాయ‌డం దేనికి నిద‌ర్శ‌నం? 

గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేయ‌డ‌మే ఆంధ్ర‌జ్యోతి దృష్టిలో తీవ్ర నేర‌మైంది. టీడీపీలో ఉంటే ఉత్త‌ములు, లేదంటే అద‌ములు అనే రీతిలో టార్గెట్ చేస్తే... అటు వైపు నుంచి మాధ‌వ్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్టే సుభాషితాలు వెలువ‌డుతాయి. గంజి చిరంజీవిది త‌ప్పు, ర‌ఘురామ‌కృష్ణంరాజుది ఒప్పు అవుతుందా...మిస్ట‌ర్ ఆర్కే.

న్యూడ్ వీడియోతో చిక్కిన గోరంట్ల మాధ‌వ్‌కు, మీడియా సంస్థ అధిప‌తిగా అనైతిక జ‌ర్న‌లిజంతో దిగంబ‌రంగా నిలిచిన‌ మీకు పెద్ద‌గా తేడా లేద‌ని పౌర స‌మాజం అంటోంది బాస్‌. కాక‌పోతే,  దిగంబ‌రంగా లేమ‌ని, విలువ‌ల‌తో బ‌తుకుతున్నామ‌ని అనుకునే స్వేచ్ఛ ఎవ‌రికైనా వుంటుంది. ఆర్కే విష‌యంలో మెజార్టీ స‌మాజం అలా భావించ‌లేద‌నే వాస్త‌వాన్ని ఇప్ప‌టికైనా ఆయ‌న‌ గ్ర‌హిస్తే మంచిది. ఈ సంద‌ర్భంగా ఈనాడు అధినేత రామోజీరావుతో మిమ్మ‌ల్ని పోల్చ‌డం అంటే, ఆ పెద్దాయ‌న్ను అవ‌మానించ‌డ‌మే కానీ... ఎప్పుడైనా ఈ ర‌కంగా ఆయ‌న దూషణ‌ల‌కు గుర‌య్యారా? ఒక్క‌సారి ఆలోచించుకోండి.  

నేతి బీర కాయ‌లో నెయ్యి, ఎండ‌మావుల్లో త‌డి, ఆర్కేలో ప‌రువు ...ఉన్నాయో, లేవో పాఠ‌కుల సృజ‌నాత్మ‌క‌త‌కు వ‌దిలేద్దాం. లేని వాటి కోసం న్యాయ పోరాటం... అంతా స‌మ‌యం వృథా త‌ప్ప‌, ఒరిగేదేమీ వుండ‌దు.

సొదుం ర‌మ‌ణ‌

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా