
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్‌కు గురైన వైసీపీ... ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. టీడీపీపై ఎదురు దాడికి మంత్రులు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా తన మార్క్ విమర్శలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక కార్యక్రమానికి మంత్రులు రోజా, కాకాణి గోవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యవహారాన్ని తప్పు పట్టారు.
రోజా మాట్లాడుతూ సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు శపథం చేయడాన్ని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు భార్య పరువును పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చారని తప్పు పట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. ఆ తర్వాత 23 సీట్లతో బాబును జనం ప్రతిపక్షంలో కూచోపెట్టారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగులుతారని రోజా జోష్యం చెప్పారు. రాజకీయం అంటే అసహ్యించుకునే పరిస్థితికి టీడీపీ దిగజారిందని విరుచుకుపడ్డారు.
టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తు ఉండదన్నారు. జగన్‌ను రాజకీయంగా మోసం చేసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రోజా శపించారు. టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్యకు పాల్పడినట్టైందని ఆమె అభిప్రాయపడ్డారు. వైశ్రాయ్ హోటల్‌లో మొదలు పెట్టిన వెన్నుపోటు రాజకీయాలను చంద్రబాబు ఇంకా నడిపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు తరిమికొట్టాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా