Advertisement

Advertisement


Home > Politics - Andhra

పనితీరుతో కాదు ...ఇలాంటి పనులతో దుమ్ము రేపుతోంది 

పనితీరుతో కాదు ...ఇలాంటి పనులతో దుమ్ము రేపుతోంది 

మనం చిన్నప్పుడు అంటే స్కూల్లో, కాలేజీలో చదువుకునేటప్పుడు అనేక అల్లరి చిల్లర పనులు చేస్తుంటాం. ఆ వయసులో ఆ పనులు చేయడం మామూలేనని సరిపెట్టుకుంటారు. కానీ చదువు ముగిశాక ఉద్యోగం చేస్తాం, పెళ్ళైతుంది, పిల్లలు పుడతారు, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, సమాజ పరంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి బాధ్యతగా ప్రవర్తించాలి. చేసే పనులు సరిగ్గా చేయాలి. అదేవిధంగా సినిమా నటీనటులు వారి వృత్తిలో ఉన్నప్పుడు ప్రేక్షకులను అలరించడానికి బయట కూడా కొన్ని సరదా పనులు చేస్తుంటారు. జనం కూడా అలాంటి పనులను సరదాగా చూసి లైట్ తీసుకుంటారు. కానీ వైసీపీ ఫైర్ బ్రాండ్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా, కొంత కాలం ఏపీఐసీసీ చైర్ పర్సన్ గా పనిచేసినా, ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నా తన సినిమా జోష్ ను, సినిమా వ్యామోహాన్ని ఏమాత్రం తగ్గించుకోవడంలేదు.

గతంలో బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, కీలక సంస్థకు అధిపతిగా ఉన్నా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా హైదరాబాదులోనే ఉంటూ టీవీ కార్యక్రమాలకు జడ్జిగా, కొన్ని కార్యాక్రమాలకు యాంకర్ గా పనిచేశారు. బాగా సంపాదించుకున్నారు. ఆమె వైఖరి సీఎం జగన్ కు కూడా చికాకు కలిగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సరే ....రోజా కోరిక ప్రకారం సీఎం ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. అయినప్పటికీ ఆమె తీరు, వైఖరిలో మార్పు లేదు. మంత్రిగా ఆమె పని తీరు ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా డాన్సులు చేస్తూ దుమ్ము రేపుతోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతున్నాయి. రోజాలో మంత్రి అయినా ఇంకా సినీ జోష్ తగ్గలేదు. పాట వినిపిస్తే చాలు డాన్స్ వేయాల్సిందే.

వైసీపీ ఎమ్మెల్యే డప్పు కొడుతూ స్టెప్పులు వేస్తుంటే..రోజా తన డాన్స్ ఫెర్ఫాన్స్ తో దుమ్ము రేపింది. వచ్చే నెల 21న ముఖ్యమంత్రి జగన్ జన్మదినం. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యటక - సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న తిరుపతి వేదికగా వీటిని మంత్రి రోజా ప్రారంభించారు. మూడు రోజుల పాటు తిరుపతిలో ఈ ఉత్సవాలు జరిగాయి. ప్రారంభం రోజున మంత్రి రోజా ధింసా - బంజారా డాన్స్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బంజారా డాన్స్ లో వేసిన స్టెప్పులతో  పార్టీ అభిమానుల కేరింతలతో తిరుపతితో మహతి స్టేడియం మార్మోగింది.

రోజా తిరుపతిలో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవాల వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎక్కడికి వెళ్లినా తనదైన స్టైల్‌లో ప్రత్యేకతను చాటుకునే మంత్రి కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక సంబురాల్లో భాగస్వామిగా మారింది. స్టేజ్‌పైకి ఎక్కి మరికొందరు బాలికలతో కలిసి స్టెప్పులు వేసింది మంత్రి. సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా చాలా హీరోల పక్కన స్టెప్పులు వేసిన రోజా మంత్రి అయినా తర్వాత కూడా చీరలో అంతే జోష్‌తో డ్యాన్స్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. సంబరాలకు చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయిన రోజా మొదటి రోజు, రెండో రోజు స్టేజ్‌పై డ్యాన్స్ చేసింది. ఇక, తిరుపతి తరువాత ఈ రోజు గుంటూరులో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో కళకారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా డప్పు వాయిస్తూ స్టెప్పులు వేసారు.

ఆహుతుల్లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. ఎమ్మెల్యేకు ధీటుగా మంత్రి రోజా స్టేజ్ పైన కళాకారులతో కలిసి డాన్స్ చేసింది. వేదిక పై చెక్క భజన కళాకారులతో అందమైన దానా ,చందమామ లాంటి. అనే సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము రేపింది. సభకు హాజరైన వారంతా రోజా డాన్స్ ను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. 

రోజా డాన్స్ చేస్తున్న సమయంలో మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన..మద్దతు లభించింది. పూర్తి హాహభావాలు ప్రదర్శిస్తూ రోజా డాన్స్ కొనసాగింది. స్టేజ్ పైన ఆర్టిస్టులకు ఏ మాత్రం తీసిపోకుండా, ఒక విధంగా తానే మెయిన్ ఆర్టిస్ట్ అన్నట్లుగా డాన్స్ లో లీనమైపోయింది. డాన్స్ మాత్రమే కాదు..మంత్రి రోజా చెక్క భజన కూడా చేసింది. 

ఇప్పుడు మంత్రి రోజా డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో హైదరాబాదులో రవీంద్రభారతిలో కూడా డాన్స్ చేసింది. అప్పుడు ఆమె ఏపీఐసీసీ పదవిలో ఉంది. తిరుపతిలో జరిగినట్లుగానే జగనన్న స్వర్ణోత్సవ వేడుకలను ఈ నెల 24 నుంచి 26  వరకు గుంటూరు జోన్‌లో నిర్వహిస్తున్నారు.  29,30తేదీల్లో రాజమండ్రి జోన్‌లో ..డిసెంబర్‌ 7వ తేది నుంచి 9వరకు విశాఖ జోన్‌లో జరుగుతాయి. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్‌ 19, 20తేదీల్లో నిర్వహిస్తారు. బహుశా అన్నిచోట్లా రోజా డాన్స్ చేస్తుందేమో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?