ఎక్కడైనా బావ కానీ, వంగతోట కాడ కాదు కదా..

అనుబంధాలను, బంధుత్వాన్ని తనకు అనుకూలంగా మాత్రమే వాడుకునే ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విమర్శలు కురిపించే విషయంలో .. ఆయన తనకు…

అనుబంధాలను, బంధుత్వాన్ని తనకు అనుకూలంగా మాత్రమే వాడుకునే ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా విమర్శలు కురిపించే విషయంలో .. ఆయన తనకు అన్న అనే సంగతి ఆమెకు గుర్తు రాదు. అవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తాను సాగిస్తున్న సత్యసంధతతో కూడిన.. పోరాటం అని ఆమె తనకు తాను భావించుకుంటారు. ఆత్మ వంచనతో దూసుకు పోతారు.

అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నుంచి ప్రతి విమర్శలతో కూడిన ఎదురుదాడి మొదలు కాగానే ఆమె ఇక సహించలేరు. సొంత చెల్లెలు అనే ఇంగితం కూడా మరచిపోతున్నారా అని అంటూ బంధుత్వం కార్డును తెరమీదికి తెస్తారు. తద్వారా తన మీద కురిసే ఎదురు దాడినీ అడ్డుకోగలను అనే నమ్మకం ఆమెకు లేదు గాని.. ప్రజల దృష్టిలో ‘చెల్లెలును కూడా అన్న తిట్టిస్తున్నాడు’ అనే కోణంలో సానుభూతి సంపాదించుకోవచ్చు అని ఆమె కుటిలయత్నం చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లెలుగా ఉండే అనుబంధం కూడా ఆమె అవకాశవాదానికి ఒక అస్త్రంగా మారిపోతున్నది. వైఎస్ షర్మిల ఏపీసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జగన్ మీద అడ్డగోలుగా విరుచుకు పడిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా గురించి పూర్తిగా జగన్ ను నిందితుడిగా ప్రోజెక్ట్ చేయడానికి, తద్వారా చంద్రబాబు నాయుడు పాపాలను కడిగేయడానికి షర్మిల నానా పాట్లు పడుతున్నారు.

జగన్ ను నేరుగా ఉద్దేశించి షర్మిల ఎన్నెన్ని మాటలు అంటున్నప్పటికీ ఆయన మాత్రం నేరుగా రెస్పాండ్ కావడం లేదు. చెల్లెల్ని నేరుగా ఒక్క మాట కూడా అనడం లేదు. అయితే.. జగన్ ను తిడుతూ ఉంటే పార్టీ మొత్తం చూస్తూ ఊరుకుంటుందని అనుకోవడం భ్రమ. పార్టీ నాయకులు ప్రతిస్పందిస్తూ షర్మిల అవకాశవాద వైఖరిని ఎండగడుతున్నారు. వీటిని మాత్రం ఆమె స్వీకరించ లేకపోతుండడం విశేషం. చెల్లెల్ని అన్న తిట్టిస్తున్నాడు అంటూ జగన్ కే ముడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

వైయస్ షర్మిల అంటే చంద్రబాబు నాయుడు కి ఇచ్చి నడిపిస్తున్న మర బొమ్మ లాగా వ్యవహరిస్తున్నారనీ తెలుగు ప్రజలు మొత్తం గుర్తిస్తున్నారు. అయినా ఎక్కడైనా బావ కానీ, వంగతోట కాడ బావ కాదని అన్న సామెత చందంగా.. షర్మిల వ్యవహారం ఉంది. ఎక్కడైనా చెల్లెలే కానీ, అన్న పతనం కళ్ళజూడాలని కంకణం కట్టుకున్న తర్వాత చెల్లెలు కార్డు ప్రయోగించడం చవకబారు తనం కదా అని విమర్శలు వినిపిస్తున్నాయి.