హీరోయిన్ల కెరీర్ కేవలం సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి తెలుగు సినిమాలో హీరోయిన్ పార్ట్ నామమాత్రమైనప్పటికీ, ఆ సినిమా సక్సెస్ తోనే హీరోయిన్ కెరీర్ ను డిసైడ్ చేస్తారు జనం. ఇప్పుడు శ్రీలీల విషయంలో కూడా ఇదే కౌంట్ డౌన్ షురూ అయింది.
ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఈ ముద్దుగుమ్మ చుట్టూరా తిరుగుతోంది. వరుసపెట్టి సినిమాలకు ఓకే చెబుతోంది శ్రీలీల. ఇలా అడ్వాన్స్ అందుకోవడం, అలా కాల్షీట్ ఇవ్వడం కామన్ అయిపోయింది. అయితే ఇలా ఎంత వరకు?
ఏ హీరోయిన్ కైనా 2-3 సినిమాలతో జాతకం తేలిపోతుంది. మొన్నటికిమొన్న కృతి శెట్టి విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు శ్రీలీల కూడా ఇదే రిపీట్ కాబోతోంది.
ఆమె నటించిన స్కంద సినిమా ఇప్పటికే విమర్శలపాలైంది. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. కనీసం మంచి డాన్స్ మూమెంట్స్ లో కూడా శ్రీలీలను వాడుకోలేకపోయారనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. దీనికితోడు ఆమె పోషించిన పాత్ర పరమ రొటీన్ గా, మరీ తీసికట్టుగా ఉందంటూ రివ్యూస్ వచ్చేశాయి.
ఇక శ్రీలీల చేతిలో మిగిలినవి మరో 4 సినిమాలు మాత్రమే. ఈ నెలలో భగవంత్ కేసరి వస్తోంది. బాలయ్య హీరో ఇందులో. ఆ తర్వాత నెల రోజులకు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ వస్తోంది. ఇక సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరుకారం ఉంది. మధ్యలో నితిన్ తో చేస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా రాబోతోంది.
ఈ 4 సినిమాల్లో కనీసం 2 సినిమాలు హిట్టయితేనే శ్రీలీల కెరీర్ సాఫీగా సాగుతుంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు, బాలకృష్ణ సినిమాలు హిట్టవ్వడం శ్రీలీలకు చాలా అవసరం.